Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

2, మే 2012, బుధవారం

భాస్కర శతకం - మారవి వెంకయ్య




                                  భాస్కర శతకం
                                                        - మారవి వెంకయ్య

అతి గుణహీన లోభికిఁ బదార్థము గల్గిన, లేక యుండినన్,
మితముగఁ గాని, కల్మిగల మీదటనైన భుజింపడింపుగా,
సతమని నంము దేహమును సంపద; నేఱులు నిండి పాఱినన్
గతుకగఁ జూచుఁ గుక్క తన కట్టడ మీఱక యెందు భాస్కరా! |చ|



ఉరుగుణవంతుఁ డొండు తనకొండపకారము సేయునప్పుడుం
బరహితమే యొనర్చు నొక పట్టున నైనను గీడుఁ జేయఁ గా
నెఱుఁగడు నిక్కమే కద; యదెట్లనఁ గవ్వము బట్టి యెంతయున్
దరువఁగఁ జొచ్చినం బెరుఁగు తాలిమి నీయదె వెన్న, భాస్కరా! |చ|



ఊరక సజ్జనుండొదిగి యుండిననైన, దురాత్మకుండు ని
ష్కారణ మోర్వలేక యపకారము చేయుట వాని విద్యగా;
చీరలు నూరు అంకములు చేసెడివైనను బెట్టెనుండగాఁ
జేరి చినింగిపోఁ గొఱుకు చింమట కేమి ఫలంబు భాస్కరా! |ఉ|



ఎట్టుగ బాటుపడ్డ, నొక యించుక ప్రాప్తములేక వస్తువుల్
పట్టుపడంగ నేరవు; నిబద్ధి సురావళిఁ గూడి రాక్షసుల్
గట్టు పెకల్చి పాల్కడలిఁ గవ్వముచేసి మధించిరంతయున్
వెట్టియ కాక యేమనుభవించిరి వారమృతంబు? భాస్కరా! |ఉ|



ఒక్కడె చాలు నిశ్చల బలోన్నతుఁ డెంతటి కార్యమైనఁ దాఁ
జక్క నొనర్పఁ; గౌరవు లసంఖ్యులు పట్టిన ధేను కోటులం
జిక్కఁగ నీక, తత్ప్రబలసేన ననేక శిలీముఖంబులన్
మొక్క వడంగఁ జేసి తుదముట్టఁడె యొక్క కిరీటి, భాస్కరా! |ఉ|



ఒరిగిన వేళ నెంతటి ఘనుండును దన్నొక రొక్క నేర్పుతో
నగపడి ప్రోదిసేయక తనంతట బల్మికిరాడు నిక్కమే;
జగమున నగ్నియైనఁ గడు సన్నగిలంబడియున్న, నింధనం
బెగయెఁగ ద్రోచి యూదక మఱెట్లు రవుల్కొన నేర్చు భాస్కరా! |చ|



కట్టడఁ దప్పి తాము చెడు కార్యముఁ జేయుచు నుండి రేని, దో
బుట్టిన వారినైన విడిపోవుట కార్యము; దౌర్మదాంధ్యముం
దొట్టిన రావణాసురునితో నెడఁ బాసి, విభీషణాఖ్యు డా
పట్టున రాముఁ జేరి, చిరపట్టముఁ గట్టుకొనండె భాస్కరా! |ఉ|



చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం;
బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడొ నుప్పు లేక రుచి పుట్టఁగ నేర్చు నటయ్య భాస్కరా! |చ|



తనకు ఫలంబు లేదని యెదం దలపోయఁడు కీర్తి గోరు నా
ఘన గుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మే
లనుకొని పూను; శేషుఁడు సహస్ర ముఖంబుల గాలి గ్రోలి; తా
ననిశము మోవఁడే మఱి మహాభరమైన ధరిత్రి భాస్కరా! |చ|



తెలియని కార్యమెల్లఁ గడతేర్చుట కొక్క వివేకి చేకొనన్
వలయు నటైన దిద్దు కొనవచ్చు ప్రయోజన మాంద్య మేమియుం
గలగదు; ఫాలమందుఁ దిలకం బిడు నప్పుడు చేత నద్దముం
గలిగిన చక్కఁ జేసికొను గాదె నరుండది చూచి భాస్కరా! |చం|



దక్షుడు లేని యింటికిఁ బదార్థము వేఱొక చోటనుండి వే
లక్షలు వచ్చుచుండినఁ బలాయనమై చనుఁ, గల్ల గాదు, ప్ర
త్యక్షము; వాగులున్ వరదలన్నియు వచ్చిన నీరు నిల్చునే
అక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరా! |ఉ|



దానముఁ జేయనేరని యధార్మికు సంపద యుండి యుండియున్
దానె పలాయనంబగుట తథ్యము; బూరుగమాను గాచినన్,
దాని ఫలంబులూరక వృధాపడిపోవవె యెండి గాలిచేఁ
గానలలోన నేమిటికిఁగాక, యభోజ్యములౌట భాస్కరా! |ఉ|



దానము సేయఁ గోరిన వదాన్యున కీయఁగ శక్తి లేనిచో
నైనఁ బరోపకారమునకై యొక దిక్కునఁ దెచ్చి యైన నీఁ
బూనును; మేఘుడంబుధికిఁ బోయి జలంబులఁ దెచ్చి యీయఁడే
వాన సమస్త జీవులకు వాంఛిత మింపెసలార భాస్కరా! |ఉ|



పూరిత సద్గుణంబు గల పుణ్యున కించుక రూప సంపదల్
దూరములైన వాని యెడ దొడ్డగ చూతురు బుద్ధిమంతు లె
ట్లారయ; గొగ్గులైన మఱి యందుల మాధురి చూచి కాదె ఖ
ర్జూర ఫలంబులన్ ప్రియము చొప్పడ లోకులు గొంట భాస్కరా! ||



పండితులైనవారు దిగువనుండగ, నల్పుఁ డొక్కడు
ద్ధండతఁ బీఠమెక్కిన బుధ ప్రకరంబులకేమి యెగ్గగున్;
కొండొకకోతిఁ జెట్టు కొనకొంమల నుండగ, గ్రింద గండ భే
రుండ మదేభ సింహనికురంబములుండవె చేరి భాస్కరా! |ఉ|



పూనిన భాగ్యరేఖ చెడిపోయిన పింమట నెట్టిమానవుం
డైనను వాని నెవ్వరుఁ బ్రియంబునఁ బల్కరు పిల్వరెచ్చటం
దానది యెట్లొకో యనినఁ దథ్యము పుష్పమువాడి వాసనా
హీనత నొంది యున్న యెడ నెవ్వరు ముట్టుదురయ్య భాస్కరా! |ఉ|



బలయుతుఁ డైన వేళ నిజ బంధుఁడు తోడ్పడుఁ గాని యాతఁడే
బలము తొలంగెనేని తన పాలిటి శత్రు; వదెట్లు పూర్ణుఁడై
జ్వలనుఁడు కానఁ గాల్చు తఱి సఖ్యముఁ జూపును వాయుదేవుఁడా
బలియుఁడు సూక్ష్మదీపమగు పట్టున నార్పదె గాలి భాస్కరా! |చ|



సన్నుత కార్య దక్షుడొకచాయ నిజప్రభ యప్రకాశమై
యున్నపుడైన లోకులకు నొండొక మేలొపరించు; సత్వ సం
పన్నుడు భీముడా ద్విజుల ప్రాణము కావడే ఏకచక్రమం
దెన్నికగా బకాసురుని నేపున రూపడఁగించి భాస్కరా! |ఉ|


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి