Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)
వివిధ శతకములు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వివిధ శతకములు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, మే 2012, బుధవారం

రామలింగేశ్వర శతకము -అడిదము సూర కవి




                             రామలింగేశ్వర శతకము
                                                        -అడిదము సూర కవి



అతి సమర్థునకు సేయగ రాని పని లేదు -విద్యాధికుల కెందు వింత లేదు
పరుషోక్తునకు నోటఁ బలుక రానిది లేదు -సత్య సంధునకు పక్షంబు లేదు
హనన కారికి నితడాత డన్నది లేదు -దురితాత్మునకు వావి వరుస లేదు
భాగ్యశాలికి లభింపని శోభనము లేదు -చెడ్డ వానికి రాని చేటు లేదు |సీ|
నేర్చి తిరిగిన వానికి నింద లేదు
కష్టమోర్వక యున్న సౌఖ్యంబు లేదు
జ్ఞాన నిధి కాకయున్న మోక్షంబు లేదు
రామలింగేశ! రామచంద్ర పుర నివాస! |తే|



కన్నంబు ద్రవ్వు తస్కరుఁ డింటి వారికి -వాడ లేదని ముంత వైచి చనునె?
తెరవాఁ టు కాఁ డు చింతించునే కట్టిన -బట్ట డుల్చిన మాన భంగమనుచు?
వలబడ్డ మెకము చూల్వహియించె ననుచును -విడువంగఁ జూచునే వేఁ టకాఁ డు?
జారుండు పరకాంత శయ్యకుఁ దారిచి -వావి గాదని పల్కి వదలి చనునె? |సీ|
ఆత్మ జను గుత్త రూకల కమ్ము నాతఁ
డరణము లొసంగఁ జూచునే యల్లునకును
ఎఱుఁ గ రింతియ కాక పరేంగితంబు
రామలింగేశ! రామచంద్ర పుర నివాస! ||



తల్లి సేవించిన దైవతార్చన మేల -తండ్రి గల్గినఁ బెన్నిధాన మేల
దీన రక్షణమున్నఁ దీర్థాటనంబేల -విద్యాధికతయున్న వేష మేల
పరమ మిత్రుండున్న బంధు వర్గంబేల -పతిభక్తి గల్గిన వ్రతములేల
రసికత్వమున్నను రత్న భూషణమేల -ఘన వాహనంబున్నఁ గవచమేల |సీ|
ఇష్ట సంసిద్ధిఁ గన దంతి నెక్క నేల
కవిత గలిగిన రాజ్యాధికారమేల
తగు వినయమున్న వశ్యౌషధంబులేల
రామలింగేశ! రామచంద్ర పుర నివాస! |తే|



పదుగురు కోఁ తి వెంబడి సంచరింపరే -వాహకు ల్లేరె శవంబులకును
గంగిరెద్దుకు లేవె ఘన తూర్యరావముల్ -కలిమి గల్గదె వార కామినులకుఁ
బులి గోవుఁ జంపి నక్కలను బోషింపదే -స్థూల కాయము లేదె దున్నలకును
పుప్పి పంటికి లేదె పుట్టంబు గట్టుట -వేణుధరుం డెద్దు వెంట రాఁ డె |సీ|
న్యాయ పద్ధతి నడువని యవని పతికి
నెన్ని చిన్నెలు గలిగిన నెందు కొఱకు
అంతమునఁ జూడవలయు నా యయ్య సుఖము
రామలింగేశ! రామచంద్ర పుర నివాస! ||



పసరంబు ఱాగైనఁ బసుల కాపరి తప్పు -ప్రజలు దుర్నయులైన ప్రభువు తప్పు
భార్య గయ్యాళైనఁ బ్రాణ నాథుని తప్పు -తనయుండు ధూర్తైనఁ దండ్రి తప్పు
అశ్వంబు ఱాంగైన నారోహకుని తప్పు -దంతి దుష్టైన మావంతు తప్పు
సైన్యంబు చెదిరి సైన్య నాథుని తప్పు -కూతురు చెడుగైన మాత తప్పు |సీ|
ఇట్తి తప్పు లెరుంగక యిచ్చ వచ్చి
నట్లు చరియించు వానికి హాని వచ్చు
నాడికలు గల్గు నది నిక్కమరసి చూడ
రామలింగేశ! రామచంద్ర పుర నివాస! |తే|



పాపాత్మునకుఁ బారుపత్తె మియ్యగరాదు -చాలని పనికి గాల్చాచ రాదు
తప్పు సేయని వాని దండింపఁ బోరాదు -చేసిన సుకృతంబుఁ చెప్పరాదు
పలుగాకి వానితో భాషింపగారాదు -చెడ్డవానికి మేలు సేయ రాదు
ఆదాయ మెరుగని యప్పు సేయగ రాదు -పలువుర ద్వేషము పడగ రాదు |సీ|
పరుల ధన సంపద కసూయ పడగ రాదు
తనదు లేమికి ఖేద మందగ రాదు
సాధు వర్తన లివిగదా చర్చ సేయ
రామలింగేశ! రామచంద్ర పుర నివాస! |తే|



పెట్టి పోసిన నాడె చుట్టాల చేరిక -కలిమి గల నాడె కాంత వలపు
సేవఁ జేసిన నాడె క్షితినాథు మన్నన, -వయసుఁ గల్గిన నాడె వనిత రక్తి
విభవంబు గల నాడె వెనువెంట దిరుగుట -వడియున్న నాడె మావారలనుట
పోరిమి గల నాడె పొరుగింట పోరట -మగుడింపఁ గల వాడె తగవు సూటి |సీ|
ఆత్మ శక్తిఁ దొలంగిన యవసరమునఁ
దనకు నెవ్వరుఁ గానిది తథ్యమరయ
బలిమి వో నవయవములె పనికి రావు
రామలింగేశ! రామచంద్ర పుర నివాస! |తే|

శ్రీమంతు నాజ్ఞప్తి సేయఁ డొకండును -బడుగు నేరము లెన్నఁ బరుగులెత్తుఁ
దోఁ టలు నఱికిన దోస మెన్నఁ డొకండు -నడవి గొట్టకు మని యాజ్ఞ వెట్టు
సరది గోర్ముంచినఁ జాటి చెప్పఁ డొకండు -తుప్పఁ గంటిన వాని దొసమెన్ను
నమ్మగొల్చిన వాని న్యాయ మెన్నఁ డొకండు -తప్పఁ గొల్చినవాని తప్పు జెప్పు |సీ|
నిట్టి పెద్దల కధికారమిచ్చి నట్టి
రాజు ననవలెఁ గాక దుర్ణయుల ననఁ గ
నేమి పనియున్నయది సత్కవీంద్రులకును,
రామలింగేశ! రామచంద్ర పుర నివాస! ||



సారమేయం బుట్టి చేరు ద్రెంపును గాని -పడకుండఁ బట్టునే పాలకుండ?
కోతి కొబ్బరి కాయ కొన కెక్కి పడద్రోయు -దాని జలంబులు త్రావఁ గలదె?
ముదుసలి పెండ్లాడి ముదిత యౌవనము వ్య -ర్థము జేయుఁ గా కేమి దానఁ గాంచు?
కాకి ముంగఱ నోరఁ గఱచి డొంకల పాలు -గావించుఁ గా కేమి గాంచు దానఁ ? |సీ|
జెడుగు నరుఁ డొరుసంపద జెఱచుఁ గాని
తనకు ఫలమేమి గలుగును తథ్య మరయ
నింద మాత్రంబు వానికి నిల్చు జగతి
రామ లింగేశ! రామచంద్ర పుర నివాస! ||

సుమతీ శతకము(బద్దెన)



                                  సుమతీ శతకము
                                                            -బద్దెన



శ్రీ రాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరా యనగా
ధారాళమైన నీతులు
నోరూరగఁ జవులు పుట్ట నుడివెద సుమతీ [1]

అక్కఱకు రాని చుట్టము,
మ్రొక్కిన వరమీని వేల్పు, మొహరమునఁ దా
నెక్కిన బాఱని గుఱ్ఱము
గ్రక్కున విడవంగవలయుఁ గదరా సుమతీ [2]



అడిగిన జీతంబియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దులఁ గట్టుక
మడి దున్నుక బ్రతుక వచ్చు మహిలో సుమతీ [3]



అడియాస కొలువుఁ గొలువకు,
గుడి మణియము సేయఁబోకు, కుజనుల తోడన్
విడువక కూరిమి సేయకు,
మడవిని దోడరకొంటి నరుగకు సుమతీ [4]



అధరము గదలియు, గదలక
మధురములగు భాష లుడుగి మౌన వ్రతుఁడౌ
అధికార రోగ పూరిత
బధిరాంధక శవముఁ జూడ బాపము సుమతీ [5]



అప్పు కొని చేయు విభవము,
ముప్పున బృఆయంపుటాలు, మూర్ఖుని తపమున్,
దప్పరయని నృపు రాజ్యము
దెప్పరమై మీఁదఁ గీడు దెచ్చుర సుమతీ [6]



అప్పిచ్చువాఁడు, వైద్యుడు,
నెప్పుడు నెడతెగక పాఱు నేఱును, ద్విజుఁడున్
జొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరు సొఱకుము సుమతీ [7]



అల్లుని మంచితనంబు,
గొల్లని సాహిత్య విద్య, కోమలి నిజమున్,
బొల్లున దంచిన బియ్యము,
దెల్లని కాకులును లేవు తెలియుము సుమతీ [8]



ఆఁకొన్న కూడె యమృతము,
తాఁకొంచక నిచ్చువాఙ్డె దాత ధరిత్రిన్,
సోఁకోర్చువాఁడె మనుజుఁడు,
తేఁకువ గలవాఁడె వంశ తిలకుఁడు సుమతీ [9]



ఆఁకలి యుడుగని కడుపును,
వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్,
బ్రాఁకొన్న నూతి యుదకము,
మేఁకల పాడియును రోఁత మేదిని సుమతీ [10]



ఇచ్చునదే విద్య, రణమున
జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులున్
మెచ్చునదే నేర్చు, వదుకు
వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ [11]



ఇమ్ముగ జదువని నోరును,
నమ్మా యని బిలిచి యన్న మడుగని నోరున్,
దమ్ముల బిలువని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ [12]



ఉడుముండదె నూరేండ్లును,
బడియుండదె పేర్మిఁ బాము పదినూరేండ్లున్,
మడువునఁ గొక్కెర యుండదె,
కడు నిలఁ బురుషార్థ పరుఁడు గావలె సుమతీ [13]



ఉత్తమగుణములు నీచున
కెత్తెఱగున గలుగ నేర్చు; నెయ్యెడలం దా
నెత్తిచ్చి కరఁగి పోసిన
నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ? [14]



ఉదకము ద్రావెడు హయమును,
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్,
మొదవు కడ నున్న వృషభము,
జదువని యానీచుఁ గడకు జనకుర సుమతీ [15]



ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపంగా;
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాఁడు నేర్పరి సుమతీ [16]



ఉపమింప మొదలు తియ్యన
కపటం బెడనెడను జెఱకు కై వడినే పో
నెపములు వెదకును గడపట
గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ [17]



ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి, యన్యుల మనముల్
నొప్పించక, తా నొవ్వక,
తప్పించుక తిరుగువాఁడు ధన్యుడు సుమతీ [18]



ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషుని గొల్వఁగూడ దది యెట్లన్నన్
సర్పంబు పడగ నీడను
గప్ప వసించిన విధంబు గదరా సుమతీ [19]



ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడు బంధువులు వత్తు రది యెట్లన్నన్
తెప్పలుఁగ జెఱువు నిండిన
గప్పలు పదివేలు చేరుఁ గదరా సుమతీ [20]



ఏఱకుమీ కసుగాయలు,
దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ,
పాఱకుమీ రణమందున,
మీఱకుమీ గురువు నాజ్ఞ మేదిని సుమతీ [21]



ఒక యూరికి నొక కరణము,
నొక తీర్పరియైనఁ గాక, నొగిఁ దఱుచైనన్,
గకవికలు గాక యుండునె
సకలంబును గొట్టువడక సహజము సుమతీ [22]



ఒరు నాత్మఁ దలఁచు సతి విడు,
మఱుమాటలు పలుకు సతుల మన్నింపకుమీ,
వెఱ పెఱుగని భటునేలకు,
తఱచుగ సతి గవయఁ బోకు, తగదుర సుమతీ [23]



ఒల్లని సతి నొల్లని పతి,
నొల్లని చెలికాని విడువ నొల్లని వాఁడే
గొల్లండు, కాక ధరలో
గొల్లండును గొల్లడౌనె గుణమున సుమతీ [24]



ఓడల బండ్లును వచ్చును,
ఓడలు నాబండ్లమీఁద నొప్పుగ వచ్చున్,
ఓడలు బండ్లును వలనే
వాడంబడు గలిమి లేమి వసుధను సుమతీ [25]



కడు బలవంతుఁడైనను
బుడమిని బ్రాయంపుటాలిఁ బుట్టిన యింటన్
దడవుండ నిచ్చెనేనియుఁ
బడుపుగ నంగడికిఁ దానె బంపుట సుమతీ [26]



కనకపు సింహాసనమున
శునకముఁ గూర్చుండబెట్టి శుభ లగ్నమునం
దొనరగఁ బట్టముఁ గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ [27]



కప్పకు నొరగాలైనను,
సర్పమునకు రోగమైన, సతి తులువైనన్,
ముప్పున దరిద్రుఁడైనను,
తప్పదు మఱి దుఃఖ మగుట తథ్యము సుమతీ [28]



కమలములు నీటఁ బాసిన
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు దప్పిన
తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ [29]



కరణముఁ గరణము నమ్మిన
మరణాంతక మౌను గాని మనలేడు సుమీ;
కరణము దన సరి కరణము
మఱి నమ్మక మర్మ మీక మనవలె సుమతీ [30]



కరణముల ననుసరింపక
విరసంబునఁ దిన్న తిండి వికటించు జుమీ
యిరుసునఁ కందెనఁ బెట్టక
పరమేశ్వరు బండి యైనఁ బారదు సుమతీ [31]



కరణము సాదైయున్నను,
గరి మద ముడిగినను, బాము గఱవక యున్నన్,
ధరఁ దేలు మీటకున్నను,
గర మరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ [32]



కసుగాయ గఱచి చూచిన
మసలక పస యొగరు రాక మధురంబగునా;
పస గలుగు యువతులుండగ
పసి బాలలఁ బొందువాఁడు పశువుర సుమతీ [33]



కవి కాని వాని వ్రాతయు,
నవరస భావములు లేని నాతుల వలపున్,
దవిలి చను పంది నేయని
వివిధాయుధ కౌశలంబు వృధరా సుమతీ [34]



కాదు సుమీ దుస్సంగతి,
పోదుసుమీ "కీర్తి" కాంత పొందిన పిదపన్,
వాదు సుమీ యప్పిచ్చుట,
లేదు సుమీ సతుల వలపు లేశము సుమతీ [35]



కాముకుఁడు దనిసి విడిచిన
కోమలిఁ బరవిటుఁడు గవయ గోరుట యెల్లన్
బ్రేమమునఁ జెఱకు పిప్పికి
చీమలు వెస మూగినట్లు సిద్ధము సుమతీ [36]



కారణము లేని నగవును,
బేరణము లేని లేమ, పృథివీ స్థలిలోఁ
బూరణము లేని బూరెయు,
వీరణము లేని పెండ్లి వృధరా సుమతీ [37]



కులకాంత తోడ నెప్పుడు
గలహింపకు, వట్టి తప్పు ఘటియింపకుమీ,
కలకంఠి కంట కన్నీ
రొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ [38]



కూరిమి గల దినములలో
నేరము లెన్నఁడును గలుగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోఁచు చుండు నిక్కము సుమతీ [39]



కొంచెపు నరు సంగతిచే
నంచితముగఁ గీడు వచ్చు నది యెట్లన్నన్
గించిత్తు నల్లి కుట్టిన
మంచమునకుఁ జేటు వచ్చు మహిలో సుమతీ [40]



కొక్కోకమెల్లఁ జదివిన,
చక్కనివాఁడైన, రాజ చంద్రుండైనన్,
మిక్కిలి రొక్కము లియ్యక,
చిక్కదురా వారకాంత సిద్ధము సుమతీ [41]



కొఱ గాని కొడుకు బుట్టిన
కొఱ గామియె కాదు, తండ్రి గుణములఁ జెఱచున్
చెఱకు తుద వెన్ను బుట్టిన
జెఱకున తీపెల్లఁ జెఱచు సిద్ధము సుమతీ [42]



కోమలి విశ్వాసంబును,
బాములతోఁ జెలిమి, యన్య భామల వలపున్,
వేముల తియ్యదనంబును,
భూమీశుల నమ్మికలును బొంకుర సుమతీ [43]



గడన గల మగనిఁ జూచిన
నడుగడుగున మడుగు లిడుదు రతివలు దమలో;
గడ నుడుగు మగనిఁ జూచిన
నడ పీనుగు వచ్చె నంచు నగుదురు సుమతీ [44]



చింతింపకు కడచిన పని,
కింతులు వలతురని నమ్మ కెంతయు మదిలో,
నంతఃపుర కాంతలతో
మంతనముల మాను మిదియె మతముర సుమతీ [45]



చీమలు పెట్టిన
పుట్టలు పాముల కిరవైనయట్లు పామరుఁడు దగన్
హేమంబుఁ గూడ బెట్టిన
భూమీశుల పాలఁ జేరు భువిలో సుమతీ [46]



చుట్టములు గాని వారలు
చుట్టములము నీకటంచు సొంపు దలిర్పన్
నెట్టుకొని యాశ్రయింతురు
గట్టిగ ద్రవ్యంబు గలుగఁ గదరా సుమతీ [47]



చేతులకుఁ దొడవు దానము,
భూతలనాథులకుఁ దొడవు బొంకమి ధరలో,
నీతియె తొడవెవ్వారికి,
నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ [48]



తడ వోర్వక, యొడ లోర్వక,
కడు వేగం బడిచి పడిన గార్యం బగునే;
తడ వోర్చిన, నొడ లోర్చిన,
జెడిపోయిన కార్యమెల్లఁ జేకుఱు సుమతీ [49]



తన కోపమె తన శత్రువు,
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము,
తన దుఃఖమె నరక మండ్రు తథ్యము సుమతీ [50]



తన యూరి తపసి తపమును,
తన పుత్రుని విద్య పెంపు, దన సతి రూపున్,
దన పెరటి చెట్టు మందును,
మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతీ [51]



తన కలిమి యింద్ర భోగము,
తన లేమియె స్వర్గలోక దారిద్ర్యంబున్,
దన చావు జల ప్రళయము,
తను వలచిన యదియె రంభ తథ్యము సుమతీ! [52]



తన వారు లేని చోటను,
జనమించుక లేని చోట, జగడము చోటన్,
అనుమానమైన చోటను,
మనుజునకును నిలువఁ దగదు మహిలో సుమతీ [53]



తమలము వేయని నోరును,
విమతులతో చెలిమి చేసి వెతబడు తెలివిన్,
గమలములు లేని కొలకును,
హిమధాముఁడు లేని రాత్రి హీనము సుమతీ [54]



తలనుండు విషము ఫణికిని,
వెలయంగాఁ దోఁక నుండు వృశ్చికమునకున్,
తల తోఁక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ [55]



తలపొడుగు ధనము పోసిన
వెలయాలికిఁ నిజము లేదు వివరింపంగా
దలఁ దడివి బాసఁ జేసిన
వెలయాలిని నమ్మరాదు వినరా సుమతీ [56]



తల మాసిన, నొలు మాసిన,
వలువలు మాసినను బ్రాణ వల్లభునైనన్
గులకాంతలైన రోఁతురు
తిలకింపగ భూమిలోనఁ దిరముగ సుమతీ! [57]



తాను భుజింపని యర్థము
మానవ పతిఁ జేరుఁ గొంత మఱి భూగతమౌఁ
గానల నీగలు గూర్చిన
తేనియ యొరుఁ జేరునట్లు తిరముగ సుమతీ! [58]



దగ్గఱ కొండెము సెప్పెడు
ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుఁడై మఱిఁ దా
నెగ్గు బ్రజ కాచరించుట
బొగ్గులకై కల్పతరువుఁ బొడుచుట సుమతీ! [59]



ధనపతి సఖుడై యుండిన
నెనయంగా శివుఁడు భిక్షమెత్తఁగ వలసెన్;
దన వారి కెంత గలిగినఁ
దన భాగ్యమె తనకుఁ గాక తథ్యము సుమతీ! [60]



ధీరులకుఁ జేయు మేలది
సారంబగు నారికేళ సలిలము భంగిన్
గౌరవమును మఱి మీఁదట
భూరి సుఖావహము నగును భువిలో సుమతీ! [61]



నడువకుమీ తెరువొక్కట,
గుడువకుమీ శత్రు నింట గూరిమి తోడన్,
ముడువకుమీ పరధనముల,
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ [62]



నమ్మకు సుంకరి, జూదరి,
నమ్మకు మొగసాల వాని, నటు వెలయాలిన్,
నమ్మకు మంగడి వానిని,
నమ్మకు మీ వామ హస్తు నవనిని సుమతీ! [63]



నయమునఁ బాలుం ద్రావరు,
భయమునను విషమ్మునైన భక్షింతురుగా;
నయమెంత దోషకారియొ,
భయమే జూపంగ వలయు బాగుగ సుమతీ! [64]



నరపతులు మేఱఁ దప్పినఁ,
దిరమొప్పఁగ విధవ యింటఁ దీర్పరి యైనన్,
గరణము వైదికుఁడైనను,
మరణాంతక మౌనుగాని మానదు సుమతీ! [65]



నవరస భావాలంకృత
కవితా గోష్టియును, మధుర గానంబును దా
నవివేకి కెంతఁ జెప్పిన
జెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ! [66]



నవ్వకుమీ సభ లోపల;
నవ్వకుమీ తల్లి, దండ్రి, నాథుల తోడన్;
నవ్వకుమీ పరసతితో;
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ [67]



నీరే ప్రాణాధారము
నోరే రసభరితమైన నుడువుల కెల్లన్
నారియె నరులకు రత్నము
చీరయె శృంగారమండ్రు సిద్ధము సుమతీ! [68]



పగవల దెవ్వరి తోడను,
వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్,
దెగ నాడ వలదు సభలను
మగువకు మనసియ్య వలదు మహిలో సుమతీ [69]



పతికడకుఁ, దన్నుఁ గూరిన
సతికడకును, వేల్పు కడకు, సద్గురు కడకున్,
సుతుకడకు రిత్తచేతుల
మతిమంతులు చనరు నీతి మార్గము సుమతీ! [70]



పనిచేయునెడల దాసియు,
ననుభవమున రంభ, మంత్రి యాలోచనలన్,
దనభుక్తి యెడలఁ దల్లియు,
నన్ఁ దన కులకాంత యుండు నగురా సుమతీ! [71]



పరనారీ సోదరుఁడై,
పరధనముల కాసపడక, పరులకు హితుఁడై,
పరులు దనుఁ బొగడ నెగడక,
పరు లలిగిన నలుగ నతఁడు పరముఁడు సుమతీ! [72]



పరసతి కూటమి గోరకు,
పరధనముల కాసపడకుఁ, బరునెంచకుమీ,
సరిగాని గోష్టి సేయకు,
సిరిచెడి చుట్టంబు కడకు జేరకు సుమతీ [73]



పరసతుల గోష్ఠి నుండిన
పురుషుఁడు గాంగేయుఁడైన భువి నింద పడున్,
బరసతి సుశీలయైనను
బరుసంగతి నున్న నింద పాలగు సుమతీ! [74]



పరులకు నిష్టము సెప్పకు,
పొరుగిండ్లకుఁ బనులు లేక పోవకు మెపుడున్,
బరుఁ గదిసిన సతిఁ గవయకు,
మెఱిఁగియుఁ బిరుసైన హయము లెక్కకు సుమతీ [75]



పర్వముల సతులఁ గవయకు,
ముర్వీశ్వరు కరుణ నమ్మి యుబ్బకు మదిలో,
గర్వింప నాలిఁ బెంపకు,
నిర్వహణము లేని చోట నిలువకు సుమతీ [76]



పలు దోమి సేయు విడియము,
తలగడిగిన నాటి నిద్ర, తరుణులయెడలన్
బొల యలుక నాఁటి కూటమి
వెల యింతని చెప్పరాదు వినరా సుమతీ! [77]



పాటెఱుఁగని పతి కొలువును,
గూటంబున కెఱుకపడని కోమలి రతియున్,
బేటెత్తఁ జేయు చెలిమియు,
నేటికి నెదురీఁదినట్టు లెన్నఁగ సుమతీ [78]



పాలను గలసిన జలమును
పాల విధంబుననె యుండుఁ బరికింపంగా
పాల చవి జెఱచుఁ గావున
పాలసుఁడగు వాని పొందు వలదుర సుమతీ [79]



పాలసునకైన యాపద
జాలింబడి తీర్పఁ దగదు సర్వజ్ఞునకున్
తేలగ్నిఁ బడఁగఁ బట్టిన
మేలెఱుఁగునె మీటుఁ గాక మేదిని సుమతీ [80]



పిలువని పనులకుఁ బోవుటఁ,
గలయని సతి గతియు, రాజు గానని కొలువుం,
బిలువని పేరంటంబును,
వలువని చెలిమియును జేయ వలదుర సుమతీ [81]



పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుఁడు జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్రుని కనుఁగొనిఁ బొగడఁగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! [82]



పురికిని ప్రాణము గోమటి,
వరికిని ప్రాణంబు నీరు వసుమతి లోనన్,
గరికిని ప్రాణము తొండము,
సిరికిని ప్రాణంబు మగువ సిద్ధము సుమతీ! [83]



పులి పాలు దెచ్చి యిచ్చిన,
నలవడఁగా గుండె గోసి యఱచే నిడినన్,
దలపొడుగు ధనము బోసిన,
వెలయాలికి గూర్మి లేదు వినరా సుమతీ! [84]



పెట్టిన దినముల లోపల
నట్టడవులనైన వచ్చు నానార్థములున్,
బెట్టని దినముల గనకపు
గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతీ! [85]



పొరుగున బగవాఁడుండిన,
నిరవొందక వ్రాతకాఁడె యేలిక యైనన్,
ధర గాఁపు కొండెమాడిన,
గరణాలకు బ్రదుకు లేదు గదరా సుమతీ! [86]



బంగారు కుదువఁ బెట్టకు,
సంగరమునఁ బాఱిపోకు సరసుడవైతే,
నంగడి వెచ్చము వాడకు,
వెంగలితోఁ జెలిమి వలదు వినరా సుమతీ [87]



బలవంతుఁడ నాకేమని
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా;
బలవంత మైన సర్పము
చలి చీమల చేతఁ జిక్కి చావదె సుమతీ! [88]



మదినొకని వలచి యుండఁగ
మదిచెడి యొక క్రూర విటుఁడు మానక తిరుగున్
బది చిలుక పిల్లి పట్టిన
జదువునె యాపంజరమున జగతిని సుమతీ [89]



మండల పతి సముఖంబున
మెండైన ప్రధాని లేక మెలఁగుట యెల్లన్
గొండంత మదపు టేనుగు
తొండము లేకుండినట్లు దోఁచుర సుమతీ [90]



మంత్రిగలవాని రాజ్యము
తంత్రము సెడకుండ నిలుచుఁ దఱచుగ ధరలో
మంత్రి విహీనుని రాజ్యము
జంత్రపుఁ గీలూడినట్లు జరుగదు సుమతీ! [91]



మాటకుఁ బ్రాణము సత్యము,
కోటకుఁ బ్రాణంబు సుభట కోటి, ధరిత్రిన్
బోటికిఁ బ్రాణము మానము,
చీటికిఁ బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ [92]



మానధనుఁ డాత్మధృతి చెడి
హీనుండగు వాని నాశ్రయించుట యెల్లన్
మానెడు జలముల లోపల
నేనుఁగు మెయి దాఁచినట్టు లెఱుఁగుము సుమతీ [93]



మేలెంచని మాలిన్యుని,
మాలను, మొగసాలెవాని, మంగలి హితుగా
నేలిన నరపతి రాజ్యము
నేలఁ గలసి పోవుఁగాని నెగడదు సుమతీ [94]



రాపొమ్మని పిలువని యా
భూపాలునిఁ గొల్వ భుక్తి ముక్తులు గలవే
దీపంబు లేని యింటను
జేపున కీళ్ళాడినట్లు సిద్ధము సుమతీ [95]



రూపించి పలికి బొంకకు,
ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలోఁ,
గోపించు రాజుఁ గొల్వకు,
పాపపు దేశంబు సొఱకు పదిలము సుమతీ [96]



లావిగలవాని కంటెను
భావింపఁగ నీతిపరుఁడు బలవంతుండౌ
గ్రానంబంత గజంబును
మావటివాఁడెక్కినట్లు మహిలో సుమతీ! [97]



వఱదైన చేను దున్నకు,
కఱవైనను బంధుజనుల కడ కేగకుమీ,
పరులకు మర్మము చెప్పకు,
పిరికికి దళవాయి తనము పెట్టకు సుమతీ [98]



వరిపంట లేని యూరును,
దొర యుండని యూరు, తోడు దొరకని తెరువున్,
ధరను పతి లేని గృహమును
నరయంగా రుద్రభూమి యనఁదగు సుమతీ [99]



వినఁదగు నెవ్వరుఁ జెప్పిన
వినినంతనె వేగ పడక వివరింపఁ దగున్
కని కల్ల నిజము దెలిసిన
మనుజుఁడె పో నీతి పరుఁడు మహిలో సుమతీ [100]



వీడెము సేయని నోరును,
జేడెల యధరామృతంబుఁ సేయని నోరున్,
పాడంగరాని నోరును
బూడిద కిరవైన పాడు బొందర సుమతీ [101]



వెలయాలి వలనఁ గూరిమి
గలగదు, మఱి గలిగెనేని కడతేఱదుగా;
బలువురు నడచెడు తెరువున
మొలవదు పువు, మొలిచెనేని పొదలదు సుమతీ [102]



వెలయాలు చేయు బాసలు,
వెలయగ మొగసాల బొందు వెలమల చెలిమిన్,
గలలోనఁ గన్న కలిమియు
విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ [103]



వేసరపు జాతి గానీ,
వీసముఁ దాఁ జేయనట్టి వీరిడి గానీ,
దాసి కొడుకైనఁ గానీ,
కాసులు గల వాఁడె రాజు గదరా సుమతీ! [104]



శుభముల పొందని చదువును,
నభినయముగ రాగరసము నందని పాటల్,
గుభ గుభలు లేని కూటమి,
సభ మెచ్చని మాటలెల్లఁ జప్పన సుమతీ [105]



సరసము విరసము కొఱకే,
పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొఱకే,
పెరుగుట విరుగుట కొఱకే,
ధర తగ్గుట హెచ్చు కొఱకె తథ్యము సుమతీ! [106]



సిరి తా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్,
సిరి తాఁ బోయినఁ బోవును
కరి మ్రింగిన వెలగ పండు కరణిని సుమతీ! [107]



స్త్రీల యెడ వాదులాడకు,
బాలురతోఁ జెలిమిచేసి భాషింపకుమీ,
మేలైన గుణము విడువకు,
మేలిన పతి నింద సేయ కెన్నఁడు సుమతీ [108]

నారాయణ శతకము(బమ్మెర పోతన)



                               నారాయణ శతకము
                                                        - బమ్మెర పోతన


నమామి నారాయణ పాద పంకజం
వదామి నారాయణ నామనిర్మలం
భజామి నారాయణ తత్త్వమవ్యయం
కరోమి నారాయణ పూజనం సదా |శ్లో|

ఆలోక్య సర్వ శాస్త్రాణి
విచార్యచ పునః పునః
ఇదమేకం సునిష్పన్నం
ధ్యాయేన్నారాయణం సదా |శ్లో|

శ్రీ రమా హృదయేశ్వరా - భక్త జన చిత్త జలరుహ భాస్కరా
కారుణ్య రత్నాకరా - నీవె గతి కావవే నారాయణా || [1]
పాప కర్మములఁ జేసి - నరక కూపములఁ బడజాల నిఁకను
నీపాద భక్తి యొసఁగి - యొక్క దరిఁ జూపవే నారాయణా || [2]
దాన ధర్మములఁ జేయ-నేర, నీ దాసులను బొగడ నేర,
నా నేరములఁ దలఁపక - దయ చేసి నన్నేలు నారాయణా || [3]
ఆన యించుక లేకను - దుర్భాష లాడు నా జిహ్వ యందు,
నీ నామ చతురక్షరి - దృఢముగా నిలుప వలె నారాయణా || [4]
ఒకటి పరిశుద్ధి లేక - నా జన్మ మకట! వ్యర్థం బాయెను
అకలంక మగు మార్గముం - జూపవే సకలేశ! నారాయణా || [5]
వేగి లేచినది మొదలు - సంసార సాగరంబున నీఁదుచు
మీ గుణము నొక వేళను - దలఁపగదె మేలనుచు నారాయణా || [6]
లోక వార్తలకు మరఁగి - కర్ణముల మీకథల విన నేరను,
ఏ కరణీ భవ జలధిఁ - దుదముట్ట నీఁదెదను నారాయణా || [7]
ఇల మనుజ జన్మ మెత్తి - సుజ్ఞాన మించు కంతయు లేకను,
కలఁతఁ జెందెడు చిత్తమున్ - స్వచ్ఛంబుగాఁ జేయు నారాయణా || [8]
యెంత పాపాత్ముఁడైన - మిముఁ దలంచి కృతకృత్యుఁడౌనుఁ,
బుడమి నింత పరుసము సోఁకిన - లోహంబు హేమమౌ నారాయణా || [9]
కామాంధకారమునను - బెక్కు దుష్కర్మములఁ జేసి నేను,
నీ మఱుఁగు జొచ్చినాను - నామీఁద నెనెరుంచు నారాయణా || [10]
సమయమైనపుడు మిమ్ముఁ -దలచుటకు శక్తి గలుగునొ కలు
గదో, సమయమని తలఁతునిపుడు -నా హృదయ కమలమున నారాయణా || [11]
ఆటలన్నియు ఱంకులు -నేనాడు మాటలన్నియు బొంకులు,
పాటింప నింతకైన -నున్నదే పాపంబు నారాయణా || [12]
వావి దప్పిన వాఁడను -దుష్క్రియా వర్తనుఁడ నగుదు నేను,
బావనునిగాఁ జేయవె ననుఁ బతిత పావనుఁడ నారాయణా || [13]
దేహమే దృఢమనుచును -దెలిసి నే మోహబద్ధుఁడ నగుచును,
సాహసంబున జేసితిఁ -నేగురు ద్రోహంబు నారాయణా || [14]
ఎన్ని జన్మము లాయెనో -నేటి కెందెందు జన్మించినానో
నన్ను దరిఁ జేర్పఁ గదవొ -యిఁకనైన నా తండ్రి నారాయణా || [15]
యమ కింకరులఁ దలఁచిన -నాగుండె యావులింపుచు నున్నది
యముని బాధలు మాన్పను -మాయప్ప వైద్యుఁడవు నారాయణా || [16]
అరయఁ గామ క్రోధముల్ -లోభంబు మోహమద మత్సర
ములు, తఱుఁగ వెప్పుడు మనసున -నిన్నెపుడుఁ దలచెదను || [17]
ఆశా పిశాచి పట్టి, -వైరాగ్య వాసనలఁ జేరనీయదు
గాసి పెట్టుచు నున్నది -నేనేమి చేయుదును నారాయణా || [18]
తాపత్రయంబుఁ జెంది -చాలఁ బరితాప మొందెడు చిత్తము
నీ పాదములఁ జెందినఁ -జల్లనై నిలిచెదను నారాయణా || [19]
చింతా పరంపరలచేఁ -చిత్తంబు చీఁకాకు పడుచున్నది,
సంతోషమునఁ గూర్పవె -దివ్య ప్రసాదములు నారాయణా || [20]
ప్రాయమెల్లను బోయెను -నాశ లెడఁ బాయఁ జాలక యున్నవి
మాయా ప్రపంచమేల -చేసెదవి మాయయ్య నారాయణా || [21]
శరణుఁ జొచ్చినవాఁడను -నేఁ జేయుదురితముల నపహరించి
పరమ పద మొసఁగఁ గదవె -యిఁకనైనఁ బరమాత్మ నారాయణా || [22]
సంకల్పములు పుట్టినఁ -గర్మ వాసనల దృఢముగఁ జేయవు
సంకటము నొందించకే -నను సత్య సంకల్ప నారాయణా || [23]
ఒకవేళ నున్న బుద్ధి -యొక వేళ నుండదిఁక నేమి సేతు
విశదంబుగాఁ జేయవే -నీవు నా చిత్తమున నారాయణా || [24]
నెట్టుకొని సకల జీవ -కోటులను గొట్టి భక్షించినాను
పొట్ట కొఱకై నీచుల -సేవించి రట్టయితి నారాయణా || [25]
నేను పుట్టినది మొదలు -ఆహార నిద్రలనె జనె కాలము
పూని యెప్పుడు సేయుదు -నీపదధ్యానంబు నారాయణా || [26]
ప్రొద్దు వోవక యున్నను -వేసరక పొరుగిండ్లు తిరుఁగుగాని
బుద్ధిమాలిన చిత్తము -నీయందుఁ బొందదే నారాయణా || [27]
ఎన్ని విధములఁ జూచిన -నిత్యమును హృదయమున మిము
మఱవక యున్నంతకన్న సుఖము -వేఱొక్కటున్నదే నారాయణా || [28]
లాభ లోభముల విడిచి -యిహపరంబులను ఫల మాసింపక
నీ భక్తులైన వారు -ధన్యులై నెగడెదరు నారాయణా || [29]
ముందు నీ సృష్టి లేక -సచ్చిదానంద స్వరూపంబును
బొంది భేదము నొందక -బ్రహ్మమై యుందువఁట నారాయణా || [30]
కాలత్రయీ బాధ్యమై -మఱి నిరాకారమై యుండు కతనఁ
జాలఁగాఁ దత్త్వజ్ఞులు -తెలియుదురు సత్తగుట నారాయణా || [31]
జ్ఞాన స్వరూపమునను -నజడమై జడ పదార్థము నెల్లను
గానఁగాఁ జేయు కతనఁ -జిత్తండ్రు ఘనులు నిను నారాయణా || [32]
సుఖ దుఃఖముల రెంటికి -వేఱగుచు సుఖ రూపమైన కతన
నఖిల వేదాంత విదులు -ఆనందమండ్రు నిను నారాయణా || [33]
గుణ మొకటియైన లేని -నీయందు గుణమయంబైన మాయ
గణుతింపఁ గను పట్టెడు -దర్పణము కైవడిని నారాయణా || [34]
అందుఁ బ్రతిబింబించిన -చిత్సదానంద సముదాయమెల్లఁ
జెందు నీశ్వర భావము -త్రిగుణ సం శ్లిష్టమయి నారాయణా ||[35]
సత్వంబు రజము తమము -నను మూఁడు సంజ్ఞలను గ్రమము
తోడఁ దత్త్వజ్ఞులేర్పరింపఁ -సద్గుణ త్రయములను నారాయణా || [36]
ప్రకృతి నీయందు లీనమై -యుండి స్మృతిని జెందిన వేళను
సకల ప్రపంచ మిటులఁ -గనుపట్టె నకళంక నారాయణా || [37]
మీరు సంకల్పించిన -యిష్టప్రకారమును జెందు మాయ
యారూఢి వివరించెద -నవ్విధం బొప్పంగ నారాయణా || [38]
పంచభూతములు మనసు -బుద్ధియును బ్రకటహంకారము
లును, నెంచంగ నిట్టిమాయ -యిదిగా ప్రపంచంబు నారాయణా || [39]
భూతపంచక తత్త్వ సం -ఘాతమునఁ బుట్టె నంతఃకరణము
ఖ్యాతిగా నందుఁ దోఁచి -చిత్తు జీవాత్మాయె నారాయణా || [40]
వెస మనో బుద్ధి చిత్తా -హంకార వృత్తు లంతఃకరణము
ప్రచురింప నవి నాలుగు -తత్త్వ రూపములాయె నారాయణా || [41]
భౌతిక రజోగుణములును -నేకమై ప్రాణంబు పుట్టించెను
వాద భేదములచేతఁ -బంచ పాపములాయె నారాయణా || [42]
అలరు ప్రాణ మపానము -వ్యానంబుదానము సమానంబులు
తలఁప నీ సంజ్ఞలమరి -వాయుతత్త్వము లొప్పు నారాయణా || [43]
ప్రత్యేక భూత సత్త్వగుణములన -బరఁగి బుద్ధీంద్రియములు
సత్త్వమున జనియించెను -దత్త్వ ప్రపంచముగ నారాయణా || [44]
చెవులు చర్మముఁ గన్నులు -జిహ్వ నాసికయుఁ బేరుల చేతను
దగిలి బుద్ధీంద్రియముల -విషయ సంతతిఁ దెలియు నారాయణా || [45]
భౌతిక తమోగుణమున -విషయములు తఱుచుగాఁ జనియిం
చెను, శబ్ద స్పర్శ రూప -రస గంధ నామములు నారాయణా || [46]
తాదృశ రజోగుణమున -జనియించె నరక కర్మేంద్రియములు
ఐదు తత్త్వమ్ము లగుచును -గర్మ నిష్ఠాదులకు నారాయణా || [47]
వాక్పాణిపాదపాయూ -పస్థలను వాని పేళ్ళమరుచుండుఁ
బ్క్వహృదయులకుఁ దెలియు -నీవిధము పరమాత్మ నారాయణా || [48]
పలుకు పనులును నడుపును -మలమూత్రములు విడుచుటీ య
యిదును వెలయఁ గర్మేంద్రియముల -విషయములు నళినాక్ష నారాయణా || [49]
పరఁగఁ జంద్రుండు బ్రహ్మ -క్షేత్రజ్ఞుఁ డరువొందు రుద్రుఁ
డచటి, పరమానసాదులకును -నధిపతులు వివరింప నారాయణా || [50]
అరయ దిక్కున వాయువు -సూర్యుఁడును, వరుణుండు, నశ్విను
లును, బరఁగ శ్రోత్రాదులకును -నధిపతులు పరికింప నారాయణా || [51]
అనలుఁ, డింద్రుఁడు, విష్ణువు -మృత్యువును, నల ప్రజాపతియుఁ
గూడి, యొనరఁగా నాడులకును -నధిపతులు పరికింప నారాయణా || [52]
పంచీకృతంబాయెను -భూతపంచకము, ప్రబలించి సృష్టి
పంచీకృతముచేతను -స్థూల రూపము లాయె నారాయణా || [53]
పది యింద్రియముల మనసు -బుద్ధియును, బ్రాణంబులైదు
గూడి, పదియేడు తత్త్వములను -సూక్ష్మరూపములాయె నారాయణా || [54]
స్థూలసూక్ష్మములు రెండు -కలుగుటకు మూలమగు నజ్ఞాన
ము, లీల కారణ మాయెను -జీవులకు నాలోన నారాయణా || [55]
ఈరెండు దేహములకు -విశ్వంబు నెల్లఁ బ్రకటనంబాయెను
నామ రూపముల చేత -లోకైక నాయకుఁడ నారాయణా || [56]
కొన్ని మాయనుఁ బుట్టును -గ్రుడ్లతోఁ గొన్ని తనువులు పుట్టు
ను, గొన్ని ధరణిని బుట్టును -జెమటలను గొన్ని హరి నారాయణా || [57]
ఈ చతుర్విధ భూతములందుఁ -గడు హెచ్చు మానవ జన్మము
నీచమని చూడరాదు -తథ్యమే నిర్ణయము నారాయణా || [58]
ఈ జన్మమందెకాని -ముక్తి మఱి యేజన్మమందు లేదు
చేసేతఁ దను దెలియక -మానవుఁడు చెడిపోవు నారాయణా || [59]
చేతనాచేతనములు -పుట్టుచును రోఁతలకు లోనగుచును
నాతంక పడుచుండును -గర్మములఁ జేతఁనుడు నారాయణా || [60]
సకలయోనులఁ బుట్టుచుఁ -బలుమాఱు స్వర్గ నరకములఁ బడు
చు, నొకట నూఱట గానక -పరితాప మొందితిని నారాయణా || [61]
వెలయ నెనుబదినాలుగు -లక్ష యోనులయందుఁ బుట్టిగిట్టి
యలసి మూర్ఛలఁ జెందుచు -బహుదుఃఖముల చేత నారాయణా || [62]
క్రమముతో మనుజగర్భ -మునఁ బడుచుఁ గర్మవశగతుఁడగు
చును, నమితముగ నచ్చోటను -గర్భనరకమునఁ బడు నారాయణా || [63]
ఈశ్వరాజ్ఞను బుట్టిన -తెలివిచే హృదయమునఁ దలపోయుచు
విశ్వమునఁ దను బొందిన -పాటెల్ల వేర్వేఱు నారాయణా || [64]
చాలు చీ! యిక జన్మము -నిఁకఁ బుట్టుఁ జాలు, శ్రీహరి భజించి
మేలు చెందెద ననుచును -జింతించు నాలోన నారాయణా || [65]
ప్రసవకాలమునఁ దల్లి -గర్భమునఁ బాదుకొని నిలువలేక
వసుధపయి నూడిపడినఁ -దెలివిచే వాపోవు నారాయణా || [66]
చనుఁబాలు గుడిచి ప్రాణ -ధారణను నిఁక మూత్ర మలము
లోను, మునిఁగితేలుచునుండును, దుర్గంధమున నారాయణా || [67]
బాలత్వమున బిత్తరై -నలుగడలఁ బాఱాడు సిగ్గులేక
పాలుపడి యౌవనమునఁ -విషయానుభవమొందు నారాయణా || [68]
ముదిమి వచ్చిన వెనుకను -సంసారమోహంబు మానకుండఁ
దుదనేఁగుఁ గర్మగతులఁ -బొందుటకు ముదమేమి నారాయణా || [69]
అజ్ఞాన లక్షణమ్ము -లిటువంటివని విచారించి నరుఁడు
సుజ్ఞానమునకుఁ -దగిన మార్గంబు చూడవలె నారాయణా || [70]
వేదాంత వేదియైన -సద్గురుని పాదపద్మములు చెంది
యాదయానిధి కరుణచే -సద్బోధ మందవలె నారాయణా || [71]
ఏ విద్యకైన గురువు -లేకున్న నావిద్య పట్టుపడదు
కావునను నభ్యాసము -గురుశిక్ష కావలెను నారాయణా || [72]
గురుముఖంబైన విద్య -నెన్నికై కొనిన భావజ్ఞానము
చిరతరాధ్యాత్మ విద్య -నభ్యసింపఁగ లేడు నారాయణా || [73]
అనపేక్షకుఁడు సదయుఁడు -వేదాంతనిపుణుఁడయ్యాచార్యు
డు దొరుకుటపురూపమపుడు -గుఱుతైన గుఱి యొప్పు నారాయణా || [74]
అట్టిసద్గురుని వెదకి -దర్శించి యా మహాత్ముని పదములు
పట్టి కృతకృత్యుఁడౌను -సాధకుఁడు గట్టిగా నారాయణా || [75]
మొగి సాధనములు నాల్గు -గలనరుఁడు ముఖ్యాధికారి యగును
దగిన యుపదేశమునకు -యోగసాధకులలో నారాయణా || [76]
ఇది నిత్య మిదియనిత్యం -బనుచుఁ దన మది వివేకించుటొ
కటి, యెదను నిహపర సుఖములు -కోరనిది యిదియొకటి || [77]
ముదముతో శమదమాది -షట్క సంపద గలిగి యుండుటొ
కటి, విదితముగ ముక్తిఁ బొందఁ -గాంక్షించు టదియొకటి || [78]
ఈనాల్గు సాధనముల -నధికారియై నిజాచార్యుఁ జేరి
నానా ప్రకారములను -శుశ్రూష నడుపవలె నారాయణా || [79]
ఉల్లమునఁ గాపట్యము -లవ మైన నుండ నీయక సతతము
తల్లి దండ్రియుఁ దైవము -గురువనుచుఁ దలఁపవలె నారాయణా || [80]
తనువు, ధనమును, సంపద -గురుని సొమ్మని సమర్పణము
చేసి, వెలసి తత్పరతంత్రుఁడై -నిత్యమును మెలఁగవలె నారాయణా || [81]
ఏనిష్ఠ గురునిష్ఠకు -దీటుగాదీ ప్రపంచంబునందు
మానసము దృఢము చేసి -యలరవలె మౌనియై నారాయణా || [82]
ఇట్టి శిష్యుని పాత్రత -వీక్షించి హృదయమునఁ గారుణ్యము
నెట్టుకొని బ్రహ్మవిద్య -గురుఁడొసఁగు నెయ్యముగ నారాయణా || [83]
బ్రహ్మంబు గలుఁగఁగానె -యేతత్ప్రపంచంబు గలిగి యుండు
బ్రహ్మంబు లేకున్నను -లేదీ ప్రపంచంబు నారాయణా || [84]
ఈ విధంబున సూక్తుల -బ్రహ్మ సద్భావంబు గలుగఁ జేసి
భావ గోచరము చేయుఁ -జిత్స్వరూపములెల్ల నారాయణా || [85]
ఆ బ్రహ్మమందె పుట్టు -విశ్వంబు నాబ్రహ్మమందె యుండు
నా బ్రహ్మమందె యణఁగు -నదె చూడు మని చూపు నారాయణా || [86]
అది సచ్చిదానందము -అది శుద్ధ మది బద్ధ మది యుక్తము
అది సత్య మది నిత్యము -అది విమలమని తెలుపు నారాయణా || [87]
అదె బ్రహ్మ మదె విష్ణువు -అదె రుద్రుఁ డదియె సర్వేశ్వరుండు
అది పరంజ్యోతి యనుచు -బోధించు విదితముగ నారాయణా || [88]
భావింప వశముగాదు -ఇట్టిదని పలుక శక్యంబుగాదు
భావంబు నిలుపుచోట -నసి తాను బరమౌను నారాయణా || [89]
అది మాయతోఁ గూడఁగ -శివుఁడాయె, నదియె విద్యను గూ
డఁగ విదితముగా జీవుఁడాయె -నని తెలుపు వేర్వేఱ నారాయణా || [90]
శివుఁడు కారణ శరీరి -కార్యంబు జీవుఁడా లక్షణములు
ద్వివిధముగఁ దెలియు ననుచు -బోధించు వివరముగ నారాయణా || [91]
అరయ నిరువది నాలుగు -తత్త్వంబులై యుండు నందమ
గుచుఁ గరతలామలకముగను -బోధించుఁ బ్రకటముగ నారాయణా || [92]
కారణము కార్యమగుచు -వ్యవహార కారణాఖ్యత నుండును
నారూఢి బ్రహ్మాండము -పిండాండ మని తెలుపు నారాయణా || [93]
ఐదు భూతములు, నింద్రి-యములు పది, యంతరంగములు
నాల్గు, ఐదు విషయములు తత్త్వ -సంఘాతమని తెలుపు నారాయణా || [94]
స్థూల సూక్ష్మాకృతులును -గారణముతో మూడు తెఱఁగులకు
ను, నీలమగు నందు నమరు -నని తెలుపు లాలించి నారాయణా || [95]
వెలసి పంచీకృతములు -నగు భూతములకుఁ బుట్టినది తను
వు, స్థూలంబు నది యనుచును -బోధించు దయతోడ నారాయణా || [96]
ఐదు నయిదింద్రియములు -ప్రాణంబు లయిదు, మనసును బు
ద్ధియుఁ, బాదుకొని సూక్ష్మ మందు -బోధించుఁ బ్రకటముగ నారాయణా || [97]
గాఢమగు నజ్ఞానము -ఈరీతిఁ గారణ శరీర మగును
మూఢులకు వశముగాదు -తెలియ విను మోదమున నారాయణా || [98]
ఈమూఁడు తనువులందు -దా నుండి ఈతనువు తాననుచును
వ్యామోహ పడుచుండు(ను) -జీవుండు వరుసతో నారాయణా || [99]
కలలేక నిద్రించును -కలఁగాంచి కడు మేలుగోరు చుండును
గలకాల మీ జీవుఁడు -త్రివిధములఁ గలసియును నారాయణా || [100]
ప్రాజ్ఞతైజస విశ్వులు -తానె, ఈపర్యాయముగ జీవుఁడు
ప్రజ్ఞగోల్పడ పొందును -సంసార బంధంబు నారాయణా || [101]
మూఁడవస్థలకు సాక్షి -యైనట్టి మూలంబు తాఁ దెలిసినఁ
జూడుమని సన్మార్గము -తేటగాఁ జూపుచును నారాయణా || [102]
నీవు దేహంబు గావు -ప్రాణంబు నీవుగావింద్రియములు
నీవుగాదని తెలుపును -వేదాంత నిలయమున నారాయణా || [103]
అనల తప్తంబు గాదు -జలమునను మునిఁగి తడిఁ జెందఁబో
దు, అనిలశుల్కంబుగాదు -నిరుపమం బని తెలుపు నారాయణా || [104]
కామహంకార మిపుడు -చిత్తంబుగా వీవు బుద్ధి నీవు
కావు మనసులు సత్యము -సాక్షివగు గట్టిగా నారాయణా || [105]
దేహధర్మములు నీకుఁ -దోఁచు టంతేగాని నిత్యముగను
మోహంబు మానుమనుచు -బోధించు ముఖ్యముగ నారాయణా || [106]
ఎన్ని దేహములు చెడిన -నీవు నేక స్వరూపుండ వగుచు
జెన్నలరి యుందు విలను -దత్త్వ ప్రసిద్ధముగ నారాయణా || [107]
అన్ని వేదాంత వాక్య -ములలో మహావాక్యములు నాలుగు
నిన్ను నీశ్వరునిగాను -వర్ణించు నిక్కముగ నారాయణా || [108]
ఉభయ దృశ్యోపాధులు, కడఁద్రోసిపోక యయ్యాత్మ మిగుల
నభయముగ నిటులెప్పుడు -చింతింపు మని తెలుపు నారాయణా || [109]
జీవ శివ తారతంయ -మున నైక్య సిద్ధి కానేర దనుచు
భావ సంశయము దీర్పు -కార్యార్థ పటిమచే నారాయణా || [110]
నిర్వికారుఁడవు నీవు -నీ యందె నిజమైన చందమునను
బర్వుఁ బ్రకృతి వికారము -లని తెలుపు ప్రౌఢిచే నారాయణా || [111]
సద్గురుం డీరీతిగా -బోధించు సరళితో వాక్యార్థము
హృద్గతముఁ జేసియుండి -జగతి జీవింపుదును నారాయణా || [112]
అని చింతనము జేయుచుఁ -జిత్తమునఁ దనివిఁ జెందుచు నెప్పు
డు, కనుదమ్ములను ముడుచుచు -ధ్యానంబుగాఁ జేయు నారాయణా || [113]
అపగతాఘ కృత్యుఁడై -ఈరీతి నభ్యాస మొనరించుచు
నపరోక్ష సిద్ధి నొందు -బ్రహ్మంబు తానగుచు నారాయణా || [114]
కందళిత హృదయుఁడగుచు -సచ్చిదానంద స్వరూపుఁడగు
చు, సందర్శితాత్ముఁడగుచు -నుండు నవికారతను నారాయణా || [115]
అవ్యయానంద పూజ్య -రాజ్య సింహాసనాసీనుఁడగుచు
భవ్యాత్ముఁడై వెలసెను -బూజ్య సంభావ్యుఁడై నారాయణా || [116]
నీవు సకలంబుగాని -యున్నదే నీకన్న వేఱొక్కటి
జీవుఁడని వర్ణించుట -వ్యవహార సిద్ధికిని నారాయణా || [117]
చిలుక పలుకులు పలికితి -నాకేమి తెలియుఁ దత్త్వ రహస్య
ము, వలదు నను నేరమెంచ -సాధులకు నళినాక్ష నారాయణా || [118]
శరణు భక్తార్తిహారి -గురురూప శరణు సజ్జన రక్షక
శరణు దురితౌఘనాశ -శరణిపుడు కరుణించు నారాయణా || [119]