Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)
జాతీయ నాయకులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జాతీయ నాయకులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, ఆగస్టు 2014, శుక్రవారం

టంగుటూరి ప్రకాశం తేది 23 ఆగష్టు జయంతి సందర్భంగా ఓ సంస్మరణ


వికీపీడియా నుండి
టంగుటూరి ప్రకాశం
Andhrakesari TanguturiPrakasam.jpg
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి
పదవీ కాలం
అక్టోబరు 1, 1953నవంబరు 15, 1954
Succeeded by బెజవాడ గోపాలరెడ్డి
వ్యక్తిగత వివరాలు
జననం ఆగష్టు 23, 1872
మరణం మే 20, 1957
భాగస్వామి హనుమాయమ్మ
మతం హిందూ
టంగుటూరి ప్రకాశం పంతులు (జ.ఆగష్టు 23, 1872 – మ.మే 20, 1957) సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు, టంగుటూరి ప్రకాశం పంతులు. 1940, 50లలోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకడు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాడు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందినవాడు.

బాల్యం

టంగుటూరి ప్రకాశం 1872 ఆగష్టు 23 న ఇప్పటి ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెము గ్రామంలో సుబ్బమ్మ, గొపాల క్రిష్నయ్య దంపతులకు జన్మించాడు. [1] ఆరుగురు పిల్లల్లో ప్రకాశం ఒకడు. అప్పటి గుంటూరు జిల్లాలోని టంగుటూరి లో వారి కుటుంబం వంశపారంపర్యంగా గ్రామ కరణం వృత్తి లో ఉండేది. ఆయన ముత్తాత టంగుటూరులో కరణీకం చేస్తూ ఉండేవాడు. ఆయనకు అప్పాస్వామి, నరసరాజు అనే ఇద్దరు కుమారులు. ఆయన ముత్తాత అనంతరం అప్పాస్వామిలో టంగుటూరులో కరణీకం చేసేవిధంగా, ఆయన తమ్ముడు నరసరాజు టంగుటూరికి దగ్గర్లో ఉన్న వల్లూరులో కరణీకం చేసేట్లుగా నిర్ణయించారు. ఆయనే ప్రకాశం తాతగారు. ఆయనకు నలుగురు కొడుకులు, ఇద్దరు కమార్తెలు. వారిలో ఆఖరి వాడైన గోపాలకృష్ణయ్యకు ప్రకాశం సంతానంగా జన్మించాడు. ఆయన పదకొండోయేట తండ్రి మరణించడంతో, పిల్లలను తీసుకుని తల్లి ఒంగోలు చేరింది. ఒంగోలులో ఆమె భోజనశాల నడపవలసి వచ్చింది. ఆ రోజుల్లో ఇలాంటి వృత్తి చేసే వారిని సమాజం లో చాలా తేలికగా చూసేవారు. పూటకూళ్ళ వ్యాపారం చేసే తల్లి సంపాదన చాలక, ప్రకాశం ధనికుల ఇళ్ళల్లో వారాలకు కుదిరాడు. పిన్న వయసులోనే ప్రకాశం నాటకాలు వేసేవాడు. తెల్లగా అందంగా ఉండడంతో ఆడ, మగ రెండు వేషాలు కూడా వేసేవాడు. ఆటల్లో కూడా చాలా చురుగ్గా ఉండేవాడు. క్రికెట్ చాలా చక్కగా ఆడేవాడు. ఆ వయసులో అల్లరిగా తిరిగేవాడు.

చదువు


రాజమండ్రి కోటిపల్లి బస్టాండు వద్ద స్వాతంత్ర సమరయోధుల పార్కులోని టంగుటూరి విగ్రహం
వల్లూరులో ప్రకాశం ప్రాథమిక విద్య సాగింది. అల్లరి చిల్లరి సావాసాల వల్లా, నాటకాల వ్యాపకం వల్లా, ప్రకాశానికి మెట్రిక్ పాస్ అవడం కష్టమయ్యింది. మిషను పాఠశాల ఉపాధ్యాయుడైన ఇమ్మానేని హనుమంతరావునాయుడు చలవతో ప్రకాశం ఫీజు లేకుండా ప్రీ మెట్రిక్ లో చదివాడు. నాయుడు రాజమండ్రి కి నివాసం మారుస్తూ, ప్రకాశంను తనతో తీసుకువెళ్ళి, అక్కడ ఎఫ్.ఏ. లో చేర్పించాడు. తరువాత మద్రాసుకు పంపించి, న్యాయశాస్త్రం చదివించాడు. ప్రకాశం 1890 లో తన అక్క కూతురైన హనుమాయమ్మను పెళ్ళి చేసుకున్నాడు. ఆ తరువాత కొద్దికాలంపాటు ఒంగోలు లో న్యాయవాద వృత్తి చేసి, 1894 లో మళ్ళీ రాజమండ్రి చేరాడు. వృత్తిలో బాగా పేరూ, పుష్కలంగా సంపదా సంపాదించాడు. తన 35వ ఏట రాజమండ్రి పురపాలక సంఘానికి అధ్యక్షుడయ్యాడు.
ఇంగ్లాండులో విద్యాభ్యాసం

బారిష్టరుగా ప్రకాశం
అప్పట్లో ప్రకాశం సెకండ్ గ్రేడ్ ప్లీడరు. కనుక పై స్థాయి కోర్టులలో వాదించడానికి అర్హత లేదు. బారిస్టరులకు మాత్రమే ఆ అర్హత ఉండేది. ఒకమారు ప్రకాశం ప్రతిభ గమనించిన ఒక బారిస్టరు ప్రకాశంను కూడా బారిస్టరు అవమని ప్రోత్సహించాడు. ఆ సలహా నచ్చి, ప్రకాశం 1904 లో ఇంగ్లాండు వెళ్ళాడు. వెళ్ళే ముందు మహాత్మా గాంధీ లాగానే మధ్యం, మాంసం, పొగాకు ముట్టనని తల్లికి మాట ఇచ్చి ఒప్పించాడు. దీక్షగా చదివి బారిస్టరు అయ్యాడు. అక్కడ భారతీయ సొసైటీలో చేరి దాదాభాయి నౌరోజీ బ్రిటీషు పార్లమెంటుకు ఎన్నిక కావడానికి ప్రచారంలో పాలు పంచుకొన్నాడు. ఈ సమయంలో ప్రకాశంకు జాతీయ భావాలు, సాంఘిక కార్యక్రమాలపై ఆసక్తి పెరిగాయి.

బారిష్టరుగా

1907లో, లండనులో ప్రశంసాపత్రంతో బారిష్టరు కోర్సు పూర్తిచేసుకొని భారతదేశం తిరిగివచ్చాక, ప్రకాశం మద్రాసు హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించాడు. అప్పట్లో మద్రాసులో ప్రసిద్ధి చెందిన బారిష్టరులందరూ ఆంగ్లేయులు లేదా తమిళులు. పేరుపొందిన తెలుగు బారిష్టరులలో ఈయనే ప్రప్రధముడు. ప్రకాశం పౌర మరియు నేర వాజ్యాలనన్నింటినీ చేపట్టేవాడు. ఈయన చేపట్టిన క్రిమినల్ కేసుల్లో ఆష్ హత్యకేసు ఒక ప్రసిద్ధిచెందిన కేసు. తిరునెల్వేలి లో కలెక్టరుగా పనిచేస్తున్న ఆష్, 1907 లో కాల్చిచంపబడ్డాడు. ఈ సంఘటన బెంగాల్ కు చెందిన జాతీయవాద నేత బిపిన్ చంద్ర పాల్ ఆ ప్రాంతాన్ని పర్యటిస్తూ దేశభక్తిపై ఉత్తేజపూరితమైన ప్రసంగాలు చేస్తున్న సమయములో జరిగింది. ప్రకాశం ఈ హత్య కేసులో, ఒక ముద్దాయి తరఫున వాదించి ఆయనకు స్వల్పశిక్ష పడేటట్టు చేశాడు. ప్రకాశం, లా టైమ్స్ అనే న్యాయవాద పత్రిక కు కూడా సంపాదకత్వం వహించేవాడు. అదే సంవత్సరం బ్రిటిషు ప్రభుత్వం పాల్ ప్రసంగాలు రాజద్రోహాన్ని ఉసిగొల్పేవిగా, ఉద్రేకపూరితముగా ఉన్నవని భావించటం వలన, ఇతరులు ముందుకు రావటానికి భయపడే సమయంలో, ఈయన బిపిన్ చంద్ర పాల్ ఇచ్చిన ప్రసంగాలకు హాజరయ్యేవాడు. లక్నో ఒడంబడిక తర్వాత ప్రకాశం కాంగ్రెసు పార్టీ మీటింగులకు తరచుగా హాజరు కావటం ప్రారంభించి, 1921 అక్టోబరు లో సత్యాగ్రహ ప్రతినపై సంతకం చేశాడు. 1921 లో స్వాతంత్ర్య సమరంలో అడుగుపెట్టి వృత్తిని వదలిపెట్టేనాటికి, లక్షల్లో సంపాదించాడు. ఆ యావదాస్తినీ, దేశసేవకే ఖర్చు చేసాడు.

ప్రజాసేవలో

లాభదాయకమైన న్యాయవాద వృత్తిని వదిలి ఇంగ్లీషు, తెలుగు మరియు తమిళ భాషలలో ఏకకాలమున విడుదలవుతున్న స్వరాజ్య పత్రికకు సంపాదకత్వం చేపట్టాడు. ఈయన ఒక జాతీయ పాఠశాలతో పాటు ఒక ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా నడిపాడు. 1921 డిసెంబర్‌లో జరిగిన అహమ్మదాబాదు సదస్సులో కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనాడు. ఏదైనా అలజడి కానీ, కల్లోలం కానీ జరిగినప్పుడు ప్రజలను ఓదార్చేందుకు అక్కడ పర్యటించేవాడు. ఈయన అకాలీ సత్యాగ్రహమప్పుడు పంజాబ్ ప్రాంతంలో, హిందూ-ముస్లిం ఘర్షణలు తలెత్తినపుడు ముల్తాన్ లోనూ పర్యటించాడు. కేరళలో మోప్లా తిరుగుబాటు సమయములో బయటిప్రాంతాల వారిపై నిషేధం విధించినా లెక్కచేయకుండా ఆ ప్రాంతాన్ని పర్యటించి, పర్యవసానంగా ఊటీ లోని తన ఆస్తిని ప్రభుత్వానికి కోల్పోయాడు. 1922లో సహాయనిరాకరణోద్యమం సందర్భంగా గుంటూరులో 30,000 మంది స్వఛ్ఛందకులతో ఒక ప్రదర్శనను నిర్వహించాడు. 1926లో కేంద్ర శాసనసభకు కాంగ్రెసు పార్టీ అభ్యర్ధిగా ఎన్నికైనాడు. అక్కడ విఠ్ఠల్‌భాయి పటేల్, మదన్ మోహన్ మాలవ్యా, జిన్నా మరియు జి.డి.బిర్లా వంటి జాతీయ నాయకులు ప్రకాశం సహచరులు.

టంగుటూరి ప్రకాశం చిత్రపటం

రాజకీయ జీవితం

1921లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1921 అక్టోబర్ 29స్వరాజ్య అనే దినపత్రికను ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే, ఈ పత్రిక మంచి ఆదరణ చూరగొన్నది. దీని తెలుగు, తమిళ సంచికలకు ప్రజలు ఎగబడ్డారు. 1928లో మద్రాసులో సైమన్‌ కమిషను బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని, తుపాకికి ఎదురు నిలిచి, కాల్చమని సవాలు చేసాడు. ఆయన ధైర్యసాహసాలకు మెచ్చి ఆంధ్ర ప్రజలు ఆయనకు ఆంధ్ర కేసరి అనే బిరుదునిచ్చి గౌరవించారు.

1937లో కాంగ్రెసు అధికారంలోకి వచ్చినపుడు, రాజాజీ మంత్రివర్గంలో ఆయన రెవిన్యూమంత్రి అయ్యాడు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. 1946లో మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికై, 13 నెలలపాటు ఆ పదవిలో కొనసాగాడు. ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాడు. స్వంతపార్టీలోని అంతర్గత రాజకీయాలకు ఆయన ప్రభుత్వం బలయ్యాక, పార్టీ నుండి బయటకు వచ్చి, స్వంతంగా ప్రజాపార్టీని స్థాపించాడు.

ఆంధ్రకేసరి

సైమన్ కమీషను, భారత దేశాన్ని సందర్శించవచ్చినప్పుడు కాంగ్రెసు పార్టీ సైమన్, గోబాక్' (సైమన్, తిరిగివెళ్లు) అన్న నినాదముతో ఆ కమీషన్ను బహిష్కరించటానికి నిర్ణయించింది. కాంగ్రెసు పార్టీ ఈ కమీషనును బహిష్కరించటానికి అనేక కారణాలున్నాయి అయితే ఆ కమీషనులో ఒక్క భారతీయ ప్రతినిధి కూడా లేకపోవటం ప్రధానమైనది. కమీషన్ వెళ్లినచోటల్లా నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు స్వాగతం పలికాయి. 1928, మార్చి 2న కమీషన్ బొంబాయిలో అడుగుపెట్టినపుడు పోలీసులు మద్రాసు వంటి సున్నిత ప్రదేశాలలో నిరసన ప్రదర్శనలను అనుమతించలేదు. అయితే, ప్యారీస్ కార్నర్ వద్ద మద్రాసు హైకోర్టు సమీపములో మూక విపరీతముగా పెరిగిపోయినది. వాళ్లను చెల్లాచెదురు చేయటానికి పోలీసులు కాల్పులు జరిపారు. పార్థ సారథి అనే యువకుడు కాల్పులకు గురై అక్కడికక్కడే మరణించాడు. ఆ యువకుని మృతదేహాన్ని సమీపించిన వారెవరినైనా కాల్చుతామని పోలీసులు హెచ్చరించారు. దీనిపై కోపోద్రిక్తుడైన ప్రకాశం, తన చొక్కా చించి ధైర్యంగా రొమ్ము చూపించి, కాల్చమని సవాలు చేశాడు. పరిస్థితిని అర్ధం చేసుకున్న పోలీసులు ప్రకాశం మరియు ఇతర అనుచరులకు తోవనిచ్చారు. ఈ సంఘటన తర్వాత ప్రజలు ఈయనను "ఆంధ్ర కేసరి" అన్న బిరుదు తో గౌరవించారు.
1930లో కాంగ్రెసు పార్టీ తమ శాసనసభ్యులందరినీ రాజీనామా చేయమన్నప్పుడు ప్రకాశం కూడా రాజీనామా చేశాడు కానీ పార్టీ యొక్క ప్రత్యామ్నాయ ప్రణాళిక నచ్చక తిరిగి ఉప ఎన్నికలలో పోటీచేసి గెలిచాడు. మదన్ మోహన్ మాలవ్యా నేతృత్వములోని జాతీయ పార్టీలో చేరాడు. గాంధీ మరియు కాంగ్రెసు పార్టీ దండి యాత్రతో ఉప్పు సత్యాగ్రహము చెయ్యాలని నిర్ణయించిన తర్వాత జాతీయ పార్టీకి రాజీనామా చేసి, తనతో పాటు ఇతరులను కూడా రాజీనామా చేయటానికి ప్రోద్బలం చేశాడు. ప్రకాశం శాసనసభ్యునిగా కూడా రాజీనామా చేసి మద్రాసులో స్వయంగా ముందుండి ఉప్పు సత్యాగ్రహం నడిపించాడు. అదే సమయంలో ప్రభుత్వము పెద్ద మొత్తములో ధరావత్తు నగదు ఆపేక్షించటంతో స్వరాజ్య పత్రికను నిలిపివేయాల్సి వచ్చింది. 1931లో ఇర్విన్ ఒడంబడిక తర్వాత పత్రికను పునరుద్ధరించాడు. కానీ ధన సమస్యల వల్ల తిరిగి నిలిపివేశాడు. 1935లో మరలా దీన్ని పునరుద్ధరించటానికి విఫలయత్నాలు సాగాయి.
1937లో కాంగ్రెసు పార్టీ ప్రాంతీయ ఎన్నికలలో పోటీ చేసి ఇతర ప్రాంతాలతో పాటు మద్రాసు ప్రెసిడెన్సీలో కూడా ఆధిక్యత తెచ్చుకున్నది. ముఖ్యమంత్రి పదవికి అభ్యర్ధిగా ప్రకాశం ముందున్నప్పటికీ, క్రియాశీల రాజకీయాలకు తిరిగివచ్చిన రాజాజీ ముఖ్యమంత్రి అయ్యేందుకు అనువుగా, కాంగ్రెసు అధిష్టానవర్గం కోరిక మేరకు తప్పుకున్నాడు. రాజాజీ మంత్రివర్గములో ప్రకాశం రెవిన్యూ శాఖామంత్రిగా పనిచేశాడు. మంత్రిగా ఈయన చేసిన పనులలో ముఖ్యమైనది, బ్రిటీషు ప్రభుత్వము పాటించే జమిందారీ వ్యవస్థ వలన వ్యవసాయరంగములో జరుగుతున్న అవకతవకలను పరిశీలించటానికి ఒక విచారణా సంఘాన్ని ఏర్పాటు చేసి, దానికి అధ్యక్షత వహించటం. రెండవ ప్రపంచ యుద్ధం రావడంతో కాంగ్రెసు మంత్రివర్గాలు, యుద్ధంలో భారతదేశం పాల్గొనటం గురించి తమను సంప్రదించలేదని రాజీనామా చేశాయి. 1941లో యుద్ధ ప్రయత్నాలకు వ్యతిరేకముగా వ్యక్తిగత సత్యాగ్రహం చేసిన ప్రముఖ దక్షిణ భారతదేశ నాయకులలో ప్రకాశం ప్రధముడు.
1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు ప్రకాశంను అరెస్టు చేసి మూడు సంవత్సరాలు జైల్లో పెట్టారు. 1945 లో జైలునుండి విడుదలైన తర్వాత, ప్రజలకు చేరువకావటానికి దక్షిణ భారతదేశమంతా పర్యటించాడు. 1946లో కాంగ్రెసు పార్టీ తిరిగి మద్రాసు ప్రెసిడెన్సీలో పోటీచేసి గెలిచింది. ఈ తరుణంలో 1946 ఏప్రిల్ 30న ప్రకాశం మద్రాసుముఖ్యమంత్రిగా ఎన్నికైనాడు. ఈయనతో పాటు తమిళ నాయకుడైన కె.కామరాజ్, జాతీయ నాయకులైన గాంధీ మరియు నెహ్రూల అభ్యర్ధి అయిన రాజాజీ ముఖ్యమంత్రి అవటాన్ని వ్యతిరేకించారు. అయితే, పార్టీలోని వివిధ వర్గాల విభిన్న అభిమతాలకు అనుగుణంగా పనిచేయలేక ప్రకాశం ప్రభుత్వం కేవలం 11 నెలలే మనగలిగింది.

స్వాతంత్ర్యానంతరం

సామాన్య ప్రజల సంక్షేమార్ధమై ప్రకాశం, తన వ్యక్తిగత భద్రతను, జవహర్ లాల్ నెహ్రూ చేసిన హెచ్చరికలనూ,, లెక్కచేయకుండా 1948లో నిజాం పాలనలో ఉన్న హైదరాబాదు రాష్ట్రాన్ని సందర్శించాడు. నిజాం యొక్క సహాయసహకారాలతో సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న రజాకార్ల నాయకుడు ఖాసిం రిజ్వీని కలిసి, రిజ్వీ తన అదృష్టాన్ని చాలా దూరం లాగుతున్నాడని హెచ్చరిక చేశాడు. ఈ సందర్భంలో ప్రకాశం ధైర్యానికి మెచ్చుకోలుగా రజాకార్లు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.
1952లో ప్రజాపార్టీని స్థాపించి అధికారములో ఉన్న కాంగ్రెసు పార్టీ మంత్రులందరూ ఎన్నికలలో ఓడిపోయేట్టు చేశాడు. అయితే ప్రజాపార్టీకి సొంతగా అధికారానికి వచ్చే మద్దతు చేకూరకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అయితే బలనిరూపణకు ముందే ఈ సంకీర్ణం కూలిపోయింది.
అంతలో 1952 డిసెంబర్లో పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకై ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ మరణించటంతో ఉద్యమం తీవ్రతరమైంది. ఉద్యమ ఫలితంగా 1953 అక్టోబర్‌ 1 న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం నియమితుడయ్యాడు. ఆయన పాలనా కాలంలో ప్రముఖ సంఘటనలెన్నో జరిగాయి. రాష్ట్రావతరణ మొదటి వార్షికోత్సవాన 2000 మంది ఖైదీలకు క్షమాభిక్ష, తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం స్థాపన, సేద్యపు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, విజయవాడ వద్ద కృష్ణా నది పై బారేజి నిర్మాణం వీటిలో ప్రముఖమైనవి. కమ్యూనిష్టులు ఈయన పాలనను వ్యతిరేకించటం, సోషలిస్టులు మద్దతు ఉపసంహరించటం వలన ముఖ్యమంత్రి అయిన 14 నెలలకే అవిశ్వాస తీర్మానంతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది.
1955లో మధ్యంతర ఎన్నికలు నిర్వహించే సమయానికి ప్రకాశం క్రియాశీల రాజకీయాలనుండి విరమించుకున్నాడు. 1956, నవంబర్ 1న అప్పటి హైదరాబాదు రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రంలో కలిసిపోయి ఆంధ్ర ప్రదేశ్ అవతరించింది. ప్రకాశం అనుయాయి అయిన నీలం సంజీవరెడ్డి సమైక్య రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినాడు. రాజకీయాలనుండి వైదొలిగినా, ప్రకాశం చురుకుగా రాష్ట్రమంతటా పర్యటించినాడు. అలాంటి ఒక ఒంగోలు పర్యటనలో వడదెబ్బకు గురై, నీరసించి హైదరాబాదులో ఆసుపత్రిలో చేర్పించబడ్డాడు. అక్కడే ప్రకాశం 1957, మే 20న పరమపదించాడు.

ఆత్మకథ

ఆయన ఆత్మకథ "నా జీవిత యాత్ర"[2]పేరిట నాలుగు భాగాల పుస్తకంగా [3] విడుదల అయింది. ఇందులో మూడు భాగాలను ఆయన వ్రాయగా, నాలుగో భాగం మాత్రం తెన్నేటి విశ్వనాథం వ్రాసాడు. దీనిలో స్వాతంత్రోద్యమ నాయకుల మనస్తత్వాలు, అప్పటి ప్రజల స్థితిగతులు వివరించబడినవి. తెలుగు సమితి హైదరాబాదు ఆగష్టు 2006 లో ప్రచురించింది. ఈ పుస్తకం హిందీ లోకి కూడా అనువదింపబడింది.

ప్రకాశం జిల్లా ఏర్పాటు

స్వాతంత్ర్య సమరయోధునిగా ప్రకాశం యొక్క ఉత్తరదాయిత్వం నేటికీ ఆంధ్ర దేశములో వెలుగొందుతూ ఉంటుంది. టంగుటూరి ప్రకాశం పంతులు జాతికి చేసిన సేవలకు గుర్తుగా 1972 డిసెంబర్ 5న ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు. గుంటూరు జిల్లాలో మూడు తాలూకాలు (అద్దంకి, చీరాల, ఒంగోలు), నెల్లూరు జిల్లాలో నాలుగు తాలూకాలు (కందుకూరు, కనిగిరి, పొదిలి, దర్శి), కర్నూలు జిల్లాలో రెండు తాలూకాలు (మార్కాపురం, గిద్దలూరు) కలిపి ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేశారు.

జ్ఞాపకార్థాలు


తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిపాలనా భవనమైన నీలం సంజీవరెడ్డి భవన్ ఎదురుగా ప్రతిష్టించిన ప్రకాశం పంతులు విగ్రహము
  • ప్రకాశం ప్రభుత్వ జూనియర్ కళాశాల ‍మరియు హైస్కూలు (1974) - అద్దంకి , ప్రకాశం జిల్లా .
  • ఆంధ్ర కేసరి యువజన సమితి, సాంస్కృతిక కళా సంఘం 30-04-1962 లో ప్రారంభించబడింది.
  • ఆంధ్ర కేసరి జూనియర్ కళాశాల 23-08-1972, పంతులు గారి శతదినోత్సవాల సందర్భంగా ప్రారంభించబడింది.
  • ఆంధ్ర కేసరి పట్టభద్ర కళాశాల 23.08.1994 లో వావిలాల గోపాలకృష్ణయ్య ద్వారా ప్రారంభించబడింది.
  • ప్రకాశం నగర్
  • ప్రకాశం నగర్ గుండ్రం పార్కు.
  • సత్యనారాయణపురం(విజయవాడ) లో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు హైస్కూలు కలదు. ఈ ప్రాధమిక పాఠశాలనందు 1వ తరగతి నుండి 10వతరగతి వరకు గలవు. ఈ పాఠశాల 1955-60 మధ్య కాలంలో మొదలుపెట్టబడినది

ప్రకాశం గురించి ప్రముఖులు

prakaskham01
భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో 1921వ సంవత్సరం చాలా కీలకమైంది. ఈ సంవత్సరం చరిత్రలో నిలిచిపోయిన ఎన్నో ఘట్టాలు స్వాతంత్ర్యోద్యమంలో జరిగాయి.
బ్రిటీష్ పాలకులు అనుసరిస్తున్న చట్టాలకు సవరణలు చేసేందుకు భారతీయ నేతలతో  మంతనాలు జరపడానికి సైమన్ కమిషన్ మద్రాసు వచ్చింది. స్వాతంత్ర్యోద్యమకులు “సైమన్ గోబ్యాక్“ అంటూ ప్యారీకార్నర్ లో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ సైమన్ కమిషన్ సభ్యుల్ని ముందుకు కదలనివ్వలేదు. జాతి దురహకారపూరితులైన బ్రిటిష్ అధికారులు స్వాతంత్ర్యోద్యమకారులమీద విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఓ యువ నేత అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
ఉద్యమకారుల్లో ఆవేశం ఉప్పొంగి కెరటమై ఎగసిపడింది. ప్రాణాలు కోల్పోయిన నేతను గుర్తించాలని కోరిన నేతల్నికూడా రైఫిల్ చూపించి బ్రిటిష్ సైన్యం బెదిరించింది. ఎవరైనా ముందుకొస్తే కాల్చి పారేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కడివాళ్లు అక్కడే స్థాణువులయ్యారు. ఇంతలో ఓ యువకెరటం ఉప్పెనలా ముందుకురికింది. కోటు గుండీల్ని లాగేసి గుండెల్ని చూపిస్తూ “ దమ్ముంటే కాల్చండిరా..!” అంటూ ఆ యువ సింహం గుండెలు చూపించింది. బ్రిటిషర్లకు గుండెల్లో గుబులు పుట్టింది. ఆంధ్రకేసరి గర్జిస్తున్న తీరుని చూసి బ్రిటిష్ అధికారులు భయపడిపోయారు.
ఏమాత్రం పొరపాటు జరిగినా అక్కడున్నవాళ్లు ప్రాణాలు తోడేస్తారన్న సంగతి బ్రిటిష్ అధికారికి తెలిసిపోయింది. చప్పున ఆ యువనేత గుండెలకేసి గురిపెట్టిఉన్న రైఫిల్ ని కిందికి దించేసి అక్కడ్నుంచి తన పటాలాన్ని తీసుకుని మరీ వెనక్కి వెళ్లిపోయాడు. ఉద్యమకారులు ఆంధ్రకేసరికి జై.. టంగుటూరి ప్రకాశం పంతులుకూ జై.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
సర్వస్వాన్నీ స్వాతంత్ర్య పోరాటానికి అర్పించిన నిస్వార్ధ జీవి టంగుటూరు ప్రకాశం పంతులు. ఆగష్టు 23, 1872లో గుంటూరు జిల్లా కనపర్తి గ్రామంలో గోపాలక్రిష్ణయ్య, సుబ్బమ్మల తొలి సంతానంగా జన్మించారు. చిన్న తనంలోనే తండ్రి చనిపోయాడు. కడుబీదరికంలో తల్లి పెంపకంలో పెరిగారు. ఈమని హనుమంతరావు నాయుడి శిష్యరికంలో విద్యనభ్యసించారు. సాహసమే ఊపిరిగా చేసుకుని బతకడం అలవాటు చేసుకున్నారు. రాజమండ్రికి మకాం మార్చి మెట్రిక్యులేషన్ పాసయ్యారు. రంగ స్థలంమీద అద్భుతమైన ప్రతిభను కనపరచిన కళాకారుడిగా ప్రకాశం పంతులు పేరు తెచ్చుకున్నారు. గురువుగారు హీరో వేషం వేస్తే తాను హీరోయిన్ వేషం వేయడం ఆనవాయితీగా మారింది.
1890లో గురువు చెల్లెలికూతురు హనుమాయమ్మను పెండ్లిచేసుకున్నారు ప్రకాశం పంతులు. మద్రాసుకు వెళ్లి లాపట్టా తీసుకున్నారు. 1994లో రాజమండ్రిలో ప్రాక్టీసు మొదలుపెట్టారు. జమీందారు కంచుమర్తి రామచంద్రరావు ఆర్ధిక సాయంతో 1907లో లండన్ లో బారిస్టర్ చదువు పూర్తి చేసి మద్రాసులో ప్రాక్టీస్ పెట్టారు. పెద్ద ఎత్తున ధనాన్ని, కీర్తిని సంపాదించారు. మద్రాసు, తిరుచిరాపల్లి, ఒంగోలు, రాజమండ్రి నగరాల్లో పెద్ద ఎత్తున పంటభూముల్ని కొన్నారు.
తర్వాత్తర్వాత తన సర్వస్వాన్నీ ప్రకాశం పంతులు దేశానికి, స్వాతంత్ర్య పోరాటానికి అర్పించారు. చివరి రోజుల్లో చిరిగిన చొక్కా తొడుక్కోవడానికికూడా వెరవని దానగుణం ఆయనది. చేతికి వెన్నెముక లేకుండా కర్నుడు దాన ధర్మాలు చేశాడని చెప్పుకోవడమేగానీ.. చూసినవాళ్లు లేరు.. కానీ.. టంగుటూరు ప్రకాశం పంతులు ముందు చేయిచాచి లేదనిపించుకున్నవాడు ఆంధ్రదేశంలో లేడు అన్నంతగా ఆయన దానధర్మాలు చేశారు. యావదాస్తినీ స్వాతంత్ర్యోద్యమంకోసం ఖర్చు పెట్టేశారు.
ఆంధ్రకేసరి బిరుదాంచితుడైన టంగుటూరి ప్రకాశం భారత స్వాతంత్ర్య సమరయోధులలో అగ్రగణ్యులు. గొప్ప న్యాయవాది, పత్రిక నిర్వాహకుడు. స్వయంకృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మేధావి, యుక్తిపరుడు, సాహసి, అన్నింటికంటే మించి మహా దేశభక్తుడు. ఇంగ్లండ్ లో బారిస్టరీ చదువుకునే రోజుల్లోనే ఆయనలో దేశ భక్తి బీజాలు నాటుకున్నాయి. తర్వాతి కాలంలో అవి అతి బలీయమైన, కోట్లాదిమందికి దారిచూపగలిగిన మహా వృక్షంగా స్వాతంత్ర్యోద్యమంలో ఎదగడానికి దోహదకారులయ్యాయి.
1916లో బాలగంగాధర్ తిలక్, అనీబిసెంట్ నడిపిన హోమ్ రూల్ ఉద్యమం ఆకర్షించింది. గాంధీ పిలుపునందుకుని న్యాయవాద వృత్తిని వదిలి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. 1921లో స్వరాజ్యం అనే ఆంగ్ల దినపత్రిక స్థాపించారు. 1937లో ఉమ్మిడి మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా పని చేశారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని మూడేళ్లు జైలుపాలయ్యారు. జైల్లో ఉన్నప్పుడు “నా జీవితయాత్ర” పేరుతో స్వీయ చరిత్ర రాసుకున్నారు. 1946లో మద్రాసు రాష్ట్రానికి0 ముఖ్యమంత్రి అయ్యారు. 1953లో ఆంధ్రరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1957లో తన 82వ ఏట హైదరాబాదులో ఆంధ్రకేసరి తనువు చాలించారు.
తెలుగు నేలకు, భరత జాతికి, భారత స్వాతంత్ర్యోద్యమానికి ఎనలేని సేవ చేసిన ఆ మహనీయుడిని ఆయన 142వ జయంతి సందర్భంగా స్మరించుకోవడం తెలుగుజాతి బాధ్యత. భరతజాతి కర్తవ్యం.