Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

23, జూన్ 2012, శనివారం

దేవులపల్లి కృష్ణశాస్త్రి కవితలు


దేవులపల్లి కృష్ణశాస్త్రి కవితలు

కృష్ణపక్షం నుంచి
స్వేచ్ఛాగానము-1

తిమిరలత తారకా కుసుమముల దాల్ప
కర్కశ శిలయు నవజీవన కళల దేర
మ్రోడు మోక చివురులెత్తి మురువు సూప
జగమునిండ స్వేచ్ఛాగాన ఝరుల నింతు.

క్రౌర్య కౌటిల్య కల్పిత కఠిన దాస్య
శృంఖలములు తమంతనె చెదరిపోవ
గగనతలము మార్మ్రోగగ కంఠమెత్తి
జగమునిండ స్వేచ్ఛాగాన ఝరుల నింతు.

చిత్త మానందమయ మరీచికల సోల
హృదయ మానంద భంగమాలికల దేల
కనుల నానంద జనితాశ్రుకణము లూర
జగమునిండ స్వేచ్ఛాగాన ఝరుల నింతు.

యుగయుగంబుల నీశ్వరయోధులగుచు
స్వేచ్ఛకై ప్రాణసుమము లర్పించువారి
అమల జీవిత ఫలము ధన్యతను గాంచ
జగమునిండ స్వేచ్ఛాగాన ఝరుల నింతు.

భయము గలిగించు కష్టాతపంబు మరచి
కరము కలిగించు వంత చీకట్లు మరచి
విశ్వమే పరవశమయి వెంట బాడ
జగమునిండ స్వేచ్ఛాగాన ఝరుల నింతు.

స్వేచ్ఛాగానము-2

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?
నా యిచ్ఛయే గాక నా కేటి వెరపు ?
కలవిహంగమ పక్షముల దేలియాడి
తారకా మణులలో తారనై మెరసి
మాయ మయ్యెదను నా మధురగానమున!
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?

మొయిలు దోనెలలోన పయనంబొనర్చి
మిన్నెల్ల విహరించి మెరపునై మెరసి
పాడుచు చిన్కునై పడిపోదు నిలకు
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?

తెలిమబ్బు తెరచాటు చెలి చందమామ
జతగూడి దోబూచి సరసాలనాడి
దిగిరాను దిగిరాను దివినుండి భువికి
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?

శీకరంబులతోడ చిరుమీలతోడ
నవమౌక్తికములతో నాట్యమ్ములాడి
జలధి గర్భమ్ము లోపల మున్గిపోదు
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?

పరువెత్తి పరువెత్తి పవనునితోడ
తరుశాఖ దూరి పత్రములను జేరి
ప్రణయ రహస్యాలు పల్కుచునుందు;
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?

అలరుపడంతి జక్కిలిగింత వెట్టి
విరిచేడె పులకింప సరసను బాడి
మరియొక్క ననతోడ మంతనంబాడి
వేరొక్క సుమకాంత వ్రీడ బోగొట్టి
క్రొందేనె సోనల గ్రోలి సోలుటకు
పూవు పూవునకును పోవుచునుందు;
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?

పక్షినయ్యెద చిన్ని ఋక్షమయ్యెదను
మధుపమయ్యెద చందమామనయ్యెదను
మేఘమయ్యెద వింత మెరపునయ్యెదను
అలరునయ్యెద చిగురాకునయ్యెదను
పాటనయ్యెద కొండవాగునయ్యెదను
పవనమయ్యెద వార్ధిభంగమయ్యెదను
ఏలకో యెప్పుడో యెటులనో గాని
మాయమయ్యెద నేను మారిపోయెదను.
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?
నా యిచ్ఛయే గాక నా కేటి వెరపు ?

తేటివలపు

మలయ సమీరణోర్మికల మాలికలం బ్రణయార్ద్ర గీతికల్
మలయుచు నాట్యమాడవు, సుమ ప్రమదామణి పుల్కరింప, నో
యళివర, తేనెలానవు, వనాంతరమంతయు చిన్నవోయె; కో
మల జలజాత పత్రముల మాటున నేటికి డాగినాడవో!

అలరు పడంతులెల్లరు హిమాంబువులన్ నవమల్లికా సతిన్
జలకము లార్చినారు, వనజాత పరాగ మలందినారు, మేల్
జిలుగు హొరంగు పొందళుకు చీరలు గట్టిరి పెండ్లికంచు; కో
మల జలజాత పత్రముల మాటున నేటికి డాగినాడవో!

అలరుచు మల్లికాపరిణయంబని వచ్చిరి పూవుబోండ్లు, కో
యిల సవరించె గొంతు, తమ యేలికకై విరిదేనెపానకం
బళితతి గూర్చె, పుప్పొడుల నత్తరులం బవనుండు చేర్చె; కో
మల జలజాత పత్రముల మాటున నేటికి డాగినాడవో!

వలపు హరించినాడవట, స్వాదు మరందము గ్రోలితంట, మై
పులకలు పుట్టగా మధురమోహన గానము జేసితంట, మా
లలన యమాయికాత్మ భ్రమరా! తగునా వగ వాడ జేయ; కో
మల జలజాత పత్రముల మాటున నేటికి డాగినాడవో!

వలపులు గ్రుమ్మరింపదు, నవప్రణయోదయ హాస్యచంద్రికల్
చిలుకదు, తోడి చిన్ని విరిచేడెలతో జతగూడి నాట్యముల్
సలుపదు, మంచుముత్యములు, షట్పద! తాల్పదు, మల్లికాంబ; కో
మల జలజాత పత్రముల మాటున నేటికి డాగినాడవో!

జలజల రాల్చు దుర్భరవిషాదమునన్ దుహినాశ్రు బిందువుల్,
వెలెవెలె పోవు మారుతము వీచిన పాదపపత్ర సంతతిన్,
తలిరుల విన్నపోయి యెదొ తప్పొనరించిన రీతి నక్కు; కో
మల జలజాత పత్రముల మాటున నేటికి డాగినాడవో!

లలిత మనోజ్ఞమూర్తి, యళిరాజు, మనోహర గాన సత్కళా
విలసితు, డార్ద్రచిత్తుడని బేల వరించెను నిన్ను మల్లికా
లలన, యెరుంగదింత యనురాగము తేనెలతేట కంచు; కో
మల జలజాత పత్రముల మాటున నేటికి డాగినాడవో!

"తేనెలంగూర్చి వలపుల దేటపరచి
 ధన్యురాలయ్యె మీ చెలి తలిరుబోణి!
 కాని నిరతంబు మల్లిక కడనె యుండి
 ముదము గూర్పగ మాకొక్క పూవె చెపుమ!"

అన్వేషణము

"తలిరాకు జొంపముల సం
 దులత్రోవల నేల వాలు తుహినకిరణ కో
 మల రేఖవొ! పువుదీవవొ!
 వెలదీ, యెవ్వతెవు నీప విటపీ వనిలోన్ ?

కారుమొయిళ్ళ కాటుక పొగల్ వెలిగ్రక్కు తమాలవాటి నే
దారియు కానరాదు, నెలతా! యెటువోయెద వర్థరాత్రి - వి
స్ఫార విలోచ నాంధ తమసమ్ముల జిమ్ముచు, వేడి వేడి ని
ట్టూరుపులన్ నిశీథ పవనోర్మి వితానము మేలుకొల్పుచున్ ?"

"అది శరద్రాత్రి; శీత చంద్రాత పాంత
 రాళ రమణీయ రజత తల్పంబునందు
 చల్లగా నిద్రవోవు వ్రేపల్లెవాడ
 సకల గోపాల గోపికా జనముతోడ.

సాము సడలిన పతి పరిష్వంగమందు
సుఖము దుఃఖము లేని సుషుప్తిలోన
స్వప్నవీథీ యథేష్ట సంచార కలన
మేను మరచిన నన్నంత మేలుకొలిపె

శర్వరీ శీత పవన పక్షముల మలసి
స్వాదు యమునోర్మి సంగీత ఝరుల గలసి
కౌముదీధౌత శుభ్ర దిక్తటుల సొలసి
మురళికా మందమంద మాధురుల ఋతులు.

ఎలదేటి చిరుపాట సెలయేటి కెరటాల
            బడిపోవు విరికన్నె వలపువోలె
తీయని మల్లెపూదేనె సోనల పైని
            తూగాడు తలిరాకు దోనెవోలె
తొలిప్రొద్దు తెమ్మెర త్రోవలో పయనమై
            పరువెత్తు కోయిల పాటవోలె
వెల్లువలై పారు వెలది వెన్నెలలోన
            మునిగిపోయిన మబ్బుతునుకవోలె

చిరుత తొలకరివానగా చిన్ని సొనగ
పొంగి పొరలెడు కాల్వగా నింగి కెగయు
కడలిగా పిల్లగ్రోవిని వెడలు వింత
తీయదనముల లీనమైపోయె నెడద.

పరువు పరువున పోవు నెదతో
పరువు లెత్తితి మరచి మేనే
మరచి సర్వము నన్ను నేనే
మరచి నడిరేయిన్."

"ప్రాణనాయకు కౌగిలి పట్టు వదలి
 యిల్లు వదలి యెన్నండు నీ పల్లె వదలి
 యడుగిడని దాన; వా నాటి యర్థరాత్రి
 విజన పథముల బడి యెట్లు వెడలినావు?"

"తావులతోడ తేనియల ధారల చిప్పిలు వేణుగీతికా
 రావముతోడ మందగతులన్ జను మారుతముల్ విశాల బృం
 దావన వీథులందు యమునా నవభంగ మృదంగ వాద్యముల్
 త్రోవ స్ఫురింపగా వలపు తొందర వెట్టగ బోతి నొంటిమై.

 సన్నని యెల్గెత్తి జాలిగా నెవరినో
              యరయుమా! పిలుచుచున్నదియె యమున!
 ప్రక్క నిర్జీవ ధావళ్యమ్ముతో నున్న
              సికతాతలమ్ము గాంచితివె, దాని?
 తుది మొదల్ లేదిదే త్రోవరుల్ త్రొక్కని
              యీ దారినే పరువెత్తినాను!
 ఈ మొండిచేతులనెత్తి యీ వనతరుల్
              శూన్యదృక్కుల దిశల్ చూచునయ్యొ!

 ఇచటనె, యిచటనే యత; డిచట నేను -
 ఇచట నీ జాజిపూ బొదరింట నేను -
 ఈ కడిమి చెట్టు క్రింద సుమ్మీ యతండు -
 సరిగ కన్నుల గట్టిన సరణి దోచు.

 శారదశర్వరీ మధురచంద్రిక, సూర్యసుతా స్రవంతికా
 చారు వినీల వీచిక, ప్రశాంత నిశా పవనోర్మి మాలికా
 చారిత నీప శాఖిక, కృశాంగిని గోపిక నేను, నాడు బృం
 దా రమణీయసీమ వినినారము మోహన వేణుగానమున్.

 మలయు పవను కౌగిలిలోనె పులకరించి
 హాయిగా కంఠమెత్తు ప్రాయంపు వంశి
 విశ్వమోహను జిలిబిలి పెదవులంటి
 యవశమైపోయి యేమి చేయంగ లేదు!

 బాలగోపాలు బోలెడు పాటగాని
 కని విని యెరుంగమెన్నండు; కరములోని
 మురళినే కాదు, నాలోని మ్రోడుటెడద,
 నీ శిధిల జీవనమ్ము మ్రోయింప గలడు.

 నందగోపకుమారు నానంద మురళి
 కా మనోహర సుషిరాపగా తరంగ
 జాలముల తారకా రవి చంద్రతతులు
 కరగి చిన్నిచిన్ని గీతలై కలిసిపోవు.

 చూచితివొ లేదొ చిన్నికృష్ణుని సొబంగు?
 పెదవి చివురు సంజల నరవిచ్చు నవ్వు
 వెన్నెల, చలించు తుమ్మెద బెళుకు చూపు,
 లోల పవన చాలిత కుటిలాలకమ్ము,
 తరళ చూడా కలాపమ్ము, మురళిగూడి
 యల్లనల్లన గొంతెత్తి యమృతగాన
 శీతల తుషారముల విరజిమ్ము వేళ
 చిన్నికృష్ణుని సొబగు చూచితివొ లేదొ?

 లేవు శరత్తమస్వినిలు లేవు మనోజ్ఞ సుధాంశుమాలికల్
 లేవు వినీల నిర్మల కళిందసుతా నవనాట్య సంపదల్
 లేవు మదీయ గాత్ర లవలింబులకాంకుర కోరకావళుల్
 లేవు కుమారగోప మురళీ మృదుగీత ఝరీ విలాసముల్!

 జిలిబిలి పట్టురేకుల వెన్క తొట్రిలు
              మల్లియ యెద దాగు మధుపరవము
 కనుచూపు దాటు నామని బాయికోయిల
              గొంతులో చిక్కు వసంతగీతి
 విభువీడి శుష్కించు విరహిణి సెలయేటి
              కడుపులో నడగిన కడలి మ్రోత
 రేనికై వెదకెడు రిక్కచూపులలోన
              చెరవడ నిండు చందురుని పాట

 యిట్టులీ దీన గోపికా హృదయ మంది
 రాంతరాళములోన త్రుళ్ళింతలాడు
 వేణునాదంబు, వినిపించు విశ్వమోహ
 నాకృతి కిశోరగాయకు నరయుచుంటి.

 ఇది నా చరితము; విని నీ
 వదరెడు తొట్రిలెదు వడకు దటునిటు కనులన్
 జెదరెడు చూపుల నేదో
 వెదకెదు! ఎవ్వతెవు నీప విటపీ వనిలోన్?"

ఏల ప్రేమింతును?

సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?
చంద్రికలనేల వెదజల్లు చందమామ?
ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?
ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?

మావిగున్న కొమ్మను మధుమాసవేళ
పల్లవము మెక్కి కోయిల పాడుటేల?
పరుల తనయించుటకొ? తన బాగు కొరకొ
గానమొనరింపక బ్రతుకు గడవబోకొ?




ప్రవాసి నుంచి
నా కుగాదులు...

నా కుగాదులు లేవు
నా కుషస్సులు లేవు
నేను హేమంత కృ
ష్ణానంత శర్వరిని.

నాకు కాలమ్మొక్క
టే కారురూపు, నా
శోకమ్మువలెనె, నా
బ్రతుకువలె,
నా వలెనె.

ఏను మరణించుచున్నాను ...

ఏను మరణించుచున్నాను; ఇటు నశించు
నాకొరకు చెమ్మగిల నయనమ్ము లేదు;
పసిడివేకువపెండ్లిండ్ల పడిన యెవరు
కరగనేర్తురు జరఠాంధకారమృతికి?

నా మరణశయ్య పరచుకొన్నాను నేనె!
నేనె నాకు వీడ్కొలుపు విన్పించినాను!
నేనె నాపయి వాలినా, నేనె జాలి
నెదనెద గదించినాను, రోదించినాను!

బ్రతికియున్న మృత్యువునై ప్రవాస తిమిర
నీరవ సమాధి క్రుళ్ళి క్రుంగినపుడేని
నిను పిలిచినాన, నా మూల్గునీడ ముసిరి
కుములునేమొ నీ గానోత్సవముల ననుచు?

ఇదియె నా చితి, పేర్చితి, నేనె దీని
వదలిపోని నా యవసానవాంఛ గాగ;
వడకని కరాలు రగులుచు దుడుకుచిచ్చు
లాలనల నింత నుసిగాగ కాలు త్రుటినె!

అలయు వాతెర యూర్చుగాలులు కదల్చి
రేపు నంతె నా కాష్ఠాల రేగు మంట
మును బ్రతుకునట్లు నా దేహమును దహింపు!
పడదులే ఆర్పగా నొక బాష్పమేని!




ఊర్వశి నుంచి
నా హృదయమందు ...

నా హృదయమందు విశ్వవీణాగళమ్ము
భోరుభోరున నీనాడు మ్రోతవెట్టు;

దశదిశాతంత్రులొక్క సుధాశ్రుతిని బె
నంగి చుక్కలమెట్లపై వంగి వంగి
నిలిచి నిలిచి నృత్యోత్సవమ్ముల చలించు.

వెలుగులో యమృతాలొ తావులొ మరేవొ
కురియు జడులు జడులు గాగ, పొరలి పారు
కాలువలుగాగ, పూర్ణకల్లోలములుగ;
కలదు నాలోన క్షీరసాగరము నేడు!

దారిదొరకని నా గళద్వారసీమ
తరగహస్తాల పిలుపుతొందర విదల్చు!
మోయలేనింక లోకాలతీయదనము!
ఆలపింతు నానందతేజోంబునిధుల!

ప్రేయసి! చలియింపని నీ
చేయి చేయి కీలింపుము
చలియించెడు నా కంఠము
నిలిచి నిలిచి పాడగా!

ఊర్వశి! ఊర్వశి! నాతో
ఊహాపర్ణాంచలముల
వెర పెరుగని కను మూయుము!
తిరుగురాని దొరకబోని
శీతాచల శిఖరోజ్వల
హిమపీఠాగ్రమున కెగసి
శిరములెత్తి కరములెత్తి
కురియింతమొ, వినిపింతమొ,
మేలుకొనిన శ్రుతు, లనంత
కాలమె వికసించి వినగ,
గంగా పవిత్రకాంతుల!
యమునా శీతలమధువుల!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి