Astrologer

See my 4 blogs - Click to Go

Follow Us on MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM! Follow Us on పరాక్రి పదనిసలు! Follow Us on  Telugu pandita darsini! Follow Us on SADHANA - ARADHANA !
అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

22, జూన్ 2012, శుక్రవారం

ఖడ్గసృష్టి



సామాన్యుని కామన

సామాన్యుని వాస్తవికత

ఈ రోజున సామాన్యుడు
ఏమీ లేనట్టివాడు
కూడూ గూడూ గుడ్డా
ఏమి లేనట్టివాడు
చదువూ సామూ శాస్త్రం
ఏమీ ఎరుగని వాడు

ఈ రోజున సామాన్యుడు
సగం దేవతాంశ, సగం
రాక్షసాంశ, సగటున ఈ
సామాన్యుడు మానవుడు

అంటే నీవూ నేనూ
ఆమె ఈమె వీడు వాడు
అంతా సామాన్యులమే
సగం వెలుగు సగం నీడ
సగం ఋతం సగం మనృతం
సగం ఆడ సగం ఈడ
సగం పశువు సగం నిసువు
ఈ వెల్తురు ఈ చీకటి

ఈ ఇరులూ ఈ వెలుగూ

వేరు వేరు గదులు కావు
ఒకటి రెండూ కూడా
ఇపుడు నిప్పు ఇపుడె పువ్వు
ఇప్పుడు దూసిన ఖడ్గం
ఇంతట్లో కౌగిలింత
ఒక నేత్రం కళారం
మరో కన్ను కర్పూరం

మూడో కంటి వాడంటూ
లేడంటే నమ్ముతావ్
చూడవోయ్ నీలోకి నీవు
ఒకటి రెండు వెరసి మూడు

నరకం స్వర్గం అన్నవి
ఒక స్థితికే రెండు పేర్లు
ఫోకస్ భేదం అంతే
లోకస్ రెండిటి కొకటే

శ్రీ అనగా లక్ష్మి, సరే
శ్రీ అంటే విషంకూడా
శ్రీశ్రీ సిరి చేదు లేక
సిరీ సిరి, చేదు చేదు

మీ ఇష్టం శ్రీకారం
గుణకారం చేసుకోండి
మీకే అర్ధం తోస్తే
ఆ కీ నే వాడుకోండి

ఒకటే శ్రీ అదే రెండు
అదే చేదు సిరీ అదే
అమరత్వం అసురత్వం
శ్రీశ్రీ ఒక మానవుడు

నేపధ్యంలో:

ఆ దాచిన పళ్ళెంలో
ఏం తెచ్చావ్ సుకవీ
ఆ మూలని సంచీలో
ఏమున్నది కవీకవీ
నీ మూసిన గుండెల్లో
ఏం దాచావ్ సుకవీ

నీ పాడని పాటలలో
రాపాడే దేదికవీ
ఆ కొసలో నీడలలో
ఏ సత్యం సుకవీ

ఏ సత్యం ఏ స్వప్నం
ఏ స్వర్గం సుకవీ
మాకోసం నీ కోసిన
వే కాన్కల పూలు కవీ

సామాన్యుని కామన

సైన్స్ వల్ల ఈ రోజున
సామాన్యుని బ్రతుకుకూడ
సౌందర్యమయం కాగల
సదుపాయం లభించింది

జన్మం చర్మం వెనకటి
సంప్రదాయమూ ఇప్పటి
సంఘస్థితులూ నెరపే
అసమానత పనికిరాదు

ఐశ్వర్యం అందరిదీ
అందుచేత అందులోన
సామాన్యుడు తన వాటా
తనకిమ్మని కోరుతాడు

బతకడమే సమస్యగా
పరిణమింప జేసినట్టి
అన్యాయాలన్నీటినీ
హతమార్చాలంటాడు

ఇదేం పెద్ద గగనమా? మ
రిదేం గొప్ప కోరికా? ఇ
కేం? ఇదొక్క విప్లవమా?
ప్రశ్నిస్తే పాపమా?

యుగసంధిది, సామాన్యుని
శకం దీన్ని కాదనరా
దిది రేపొచ్చే వ్యవస్థ
కివాళనించీ, పునాది
ఇప్పటినించీ నాంది

అంతే, ఇంతే స్వప్నం:
అన్నీ ఒక్కడికి బదులు
అంత మందికీ అన్నీ:
అదే స్వర్గమంటాను

ఆ స్వర్గం వేరే కడు
దూరంలో లేదు లేదు
ఈడే నేడే వున్నది
నీలో నాలో వున్నది

మీ ఇష్టం ఈ ధాత్రిని
చేయవచ్చు స్వర్గంగా
చీల్చవచ్చు నరకంగా
ఏంచేస్తారో మరి ఇక మీ ఇష్టం

నగరంలో వృషభం

నగరంలో నడి వీధిలో
వృషభం తీరుబాటుగా
గత జన్మ సంస్కృతులు కాబోలు
కనులరమోడ్చి నెమరేస్తూ
కదలకుండా మెదలకుండా
నగరం హృదయంలో వృషభం
దారికి హక్కుదారు తానే ఐనట్టు
పరిత్యజించి కాలానికి బాధ్యత
పరిహసించి నాగరికత పరుగు
నిలబడింది నేనే రాజునని

ఎవరు పొమ్మనగల రీ ఎద్దుని
ఎలా చూస్తుందో చూడు
ఏయ్ ఏయ్ మోటారుకారూ
ఏవిటేవిటి నీ తొందర
భాయ్ భాయ్ సైక్లిస్ట్
భద్రంసుమీ ఎద్దు నిన్ను తప్పుకోదు
యంత్రవిరోధి అహింసావాది శాకాహారి
మద్యనిషేధ ప్రజ్ఞాశాలి
నగరంలో నడివీధిలో
నాగరికత గమనాన్ని నిరోధిస్తూ
ఇలా ఎంతసేపైనా సరే
ఈ ఎద్దు నిలబడగలదు

ఎద్దుకి లేకపోతే బుద్ధి
మనిషికేనా ఉండొద్దా?

హేమంతం

ఎవరా వస్తున్నది చెట్లమీంచి గాలికాదు
మైదానం మీద దూకు సెలయేళ్ళవి కావు కావు
తన మిహికా సామ్రాజ్యం తనిఖీ చేసేటందుకు
అదిగో హేమంతరాజు కోటవెడలి కదలినాడు
అడవిదార్లు మూసుకుపోయాయా లేదా?  హిమాని
కడు శ్రద్ధగ తన పని చేస్తున్నదా లేదా? ఈ
ధరణీతలమంతా ఏ యెగుడుదిగుడు లేకుండా
మంచు కప్పి ఉందా అని మరీమరీ చూస్తాడు.
టేకుచెట్లు, తురాయీలు, ఓకుచెట్లు రంగవల్లి
సవరించాయా లేదా? సెలయేళ్ళూ పెద్ద నదులు
గడ్డకట్టి సమత్వాన్ని సాధించాయా లేదా?
వస్తున్నా డతడు వృక్షవాటికలం దూగులాడి!
మంచుమీద అతని పదధ్వనులు మీరు వినలేదా?
అతని తెల్లని గడ్డం అదిగో కనబడలేదా?

     (మూలం: నికొలాయ్ నెక్రసోవ్)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి